పెళ్లి, సంతాన సమస్యలా..? ఈ ప్రత్యేక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. ఎక్కడుందంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం.

పెళ్లి, సంతాన సమస్యలా..? ఈ ప్రత్యేక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. ఎక్కడుందంటే..?
Sri Laxmi Thirupatamma Temp

Updated on: Feb 19, 2026 | 12:34 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రంలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటిలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం గురించి ఇప్పుడు తెలసుకుంటున్నాం. అదే ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం (Sri Lakshmi Tirupatamma Ammavari Devasthanam). మున్నేరు నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం 17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. ప్రస్తుతం తిరుపతమ్మ తిరునాళ్లు భక్తి ఉత్సాహాలతో కొనసాగుతున్నాయి. పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జానపద దేవతా క్షేత్రాలలో ఒకటి. సాధారణ మనిషిగా జన్మించి, తన పవిత్ర జీవనంతో దైవత్వాన్ని పొందిన అమ్మవారిగా తిరుపతమ్మ కథనం చెప్పబడుతుంది. గ్రామీణ సాంప్రదాయాల్లో ఇలాంటి దైవీకరణ కథలు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. అలాంటి మహిమాన్విత క్షేత్రం ఇదే.

ఆలయ చరిత్ర

పూర్వం గోపినేని పాలెం గ్రామంలో శివరామయ్య–రంగమ్మ దంపతులు నివసించేవారు. వారు ఎంతోకాలం సంతాన సౌఖ్యం లేక బాధపడుతూ చివరకు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. స్వామివారి అనుగ్రహంతో వారికి పాప జన్మించింది. భక్తితో ఆ బాలికకు ‘తిరుపతమ్మ’ అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే తిరుపతమ్మకు దైవభక్తి, వినయం, కరుణ గుణాలు ఎక్కువ. ఆమె తేజస్సు, మృదుత్వం గ్రామస్థులందరినీ ఆకట్టుకునేవి.

యుక్త వయసులో తిరుపతమ్మకు పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన గోపయ్యతో వివాహం జరిగింది. అత్తవారింట అడుగుపెట్టిన నాటి నుంచి వారి ఇంటికి సౌభాగ్యం కలిగింది. అయితే ఆమెపై భర్తకు ఉన్న ప్రేమను అత్తమామలు ఇష్టపడలేదు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. పశువుల కోసం గోపయ్య అడవికి వెళ్లగా, ఆ సమయంలో తిరుపతమ్మను అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేశారు.

గోపయ్య మరణం – తిరుపతమ్మ దివ్యత్వం

దురదృష్టవశాత్తు అడవిలో పులి దాడికి గురై గోపయ్య మరణించాడు. ఆ వార్త గ్రామానికి చేరకముందే తిరుపతమ్మకు ఆ విషయం తెలిసినట్లు చెబుతారు. ఆ సమయంలో ఆమె ముఖకాంతి మరింత దివ్యంగా మారింది. గ్రామస్థులను సమీకరించి, తనకు, తన భర్తకు ఆలయాలు నిర్మించి పూజలు జరపాలని ఆమె కోరింది. కష్టకాలంలో అండగా నిలిచిన పాపమాంబ వంశీకుల నుంచే ప్రథమ పూజలు అందుకోవాలని చెప్పి ఆమె అదృశ్యమయ్యింది.

ఇలదేవతగా ఆరాధన

తిరుపతమ్మ ఆజ్ఞ ప్రకారం గ్రామస్థులు ఆలయ నిర్మాణం చేసి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి తిరుపతమ్మ ఆ ప్రాంత ప్రజల ఇలదేవతగా, ఇష్టదేవతగా వెలుగొందుతోంది. ఎంతోమంది భక్తులు తమ పిల్లలకు అమ్మవారి పేరును పెట్టుకోవడం ద్వారా తమ భక్తిని వ్యక్తపరుస్తున్నారు.

తిరునాళ్ల వైభవం

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు చిన్న తిరునాళ్లు, ఫాల్గుణ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు పెద్ద తిరునాళ్లు నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి నాడు అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. అమ్మవారి దీక్షలు స్వీకరించిన భక్తులు కళ్యాణోత్సవ సందర్భంగా దీక్షలను విరమిస్తారు.

ఒక్కసారి దర్శించినా..

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుంటే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. ఇక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. అంతేగాక, ఆలయాన్ని దర్శించుకున్నవారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత ఆలయాన్ని మీరు ఒకసారి దర్శించుకోండి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని విశ్వసించాలా లేదా అనేది మీ వ్యక్తి గతం.)

Follow Us