
సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండగ ఎంతో ప్రత్యేకమైన పండగ. ఈ పండగను కాలానుగుణ మార్పుల పండగ మాత్రమే కాకుండా సూర్య భగవానుడిని పూజించి కష్టాలను దూరం చేసుకునే గొప్ప పండగగా పరిగణిస్తారు. సంక్రాంతి పండగను ఆయా ప్రాంతాల్లో జనవరి 14 లేదా 15 తేదీల్లో జరుపుకుంటున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో జాతకంలో సూర్య దోషం ఉంటే.. ఒక వ్యక్తి జీవితంలో ఆరోగ్యం, సంబంధాలు, వృత్తికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయని మతపరమైన విశ్వాసం.
అందుకే మకర సంక్రాంతి రోజున సూర్య దేవుడిని ఆరాధించి దోషాలను తొలగించుకుంటారు. సంక్రాంతి రోజున చేసే పరిహారాలు, పూజలు జీవితంలో స్థిరత్వం, ఆరోగ్యం, విజయానికి మార్గం సుగమం చేస్తాయని చెబుతారు.
సూర్య దోషం నుంచి ఉపశమనం పొందడానికి మకర సంక్రాంతినాడు ప్రత్యేక చర్యలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. తెల్లవారుజామున స్నానం చేసి సూర్యుడిని పూజించడం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగా లేదా పవిత్ర జలంతో స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేయాలి. రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు, తృణధాన్యాలు, బెల్లం ఉంచి సూర్యుడికి ప్రార్థనలు చేయడం ఉత్తమ మార్గమని పండితులు చెబుతున్నారు. ప్రార్థనలు చేస్తున్నప్పుడు సూర్య మంత్రం లేదా గాయత్రీ మంత్రాన్ని జపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
అంతేగాక, దానధర్మాలు, సేవ కూడా సూర్య దోషాన్ని తొలగిస్తాయి. ఈరోజున నువ్వులు, బెల్లం, ధాన్యాలు, దుస్తులు, ఆహారాన్ని దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. దానధర్మాలు పుణ్యాన్ని పెంచడమే కాకుండా జీవితంలో అడ్డంకులను తగ్గిస్తాయి. కష్టాల నుంచి రక్షిస్తాయని నమ్మకం. సూర్య మంత్రాలను జపిస్తూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా సూర్య ఆరాధన చేయాలి. ఇది సూర్య దోష నివారణకు అత్యంత ప్రభావంతమైన నివారణగా చెప్పబడింది.
ఇలా చేయడం వల్ల సూర్య దోషం తొలగిపోయి.. కెరీర్, గౌరవం, సంబంధాలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇక, గృహంలోని పూజా మందిరంలో తామ్ర సూర్య విగ్రహం ఉంచి పూజ చేయడం ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, జీవన స్థిరత్వం పెరుగుతాయి.
సూర్య దోషం నివారణ ఎందుకు ముఖ్యం?
సూర్య దోషం ఉంటే: ఆరోగ్యం దెబ్బతినడం, ఉద్యోగ సమస్యలు, కుటుంబ ఘర్షణలు, ఆత్మవిశ్వాసం లోపం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే, మకర సంక్రాంతి రోజు చేయబడే పూజలు, దానం, సూర్య ఆరాధనతో ఈ ప్రభావాలను తగ్గిస్తాయి.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.