రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎలా పెంచారు? వాళ్లు ఎలా చదువుకుని ఉంటారు? ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..

| Edited By: Ravi Kiran

Dec 21, 2022 | 7:00 AM

వేల సంవత్సరాల క్రితం పిల్లల్ని ఎలా పెంచేవారు? ముఖ్యంగా పురాణ కాలంలో పిల్లల పెంపకం ఏ విధంగా ఉండేది? రామాయణ కాలంలో..

రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎలా పెంచారు?  వాళ్లు ఎలా చదువుకుని ఉంటారు? ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..
Krishna And Rama
Follow us on

వేల సంవత్సరాల క్రితం పిల్లల్ని ఎలా పెంచేవారు? ముఖ్యంగా పురాణ కాలంలో పిల్లల పెంపకం ఏ విధంగా ఉండేది? రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడిని, భాగవత కాలంలో శ్రీకృష్ణుడిని ఎలా పెంచి ఉంటారు? వాళ్లు ఎలా చదువుకుని ఉంటారు? ఈ విషయంలో రామాయణం, భాగవతం ఏం చెబుతున్నాయంటే, అప్పటి చదువులు పూర్తిగా నీతి కథలు, శాస్త్రాలు, సంస్కారం, యుద్ధ విద్యలు, వేద విద్యల మీద ఆధారపడి ఉండేవి. నీతి కథలు కూడా జంతువులు, పశువులు, పక్షులు, చెట్లు మొక్కల మీద ఆధారపడి ఉండేవి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఐదేళ్లు వచ్చేవరకు తమ తల్లుల దగ్గరే ఓనమాలు దిద్ది ప్రాథమిక విద్య పూర్తి చేశారని రామాయణం చెబుతోంది. ప్రాథమిక విద్యను నేర్పే సమయంలోనే సంస్కారాన్ని కూడా నేర్పేవారు. రాముడు నీతి కథలు అంటే చెవి కోసుకునేవాడని వాల్మీకి తన రామాయణ గ్రంథంలో తెలియజేశాడు. రాముడు, భరతుడు బుద్ధిగా చదువుకునేవారని, లక్ష్మణ శత్రుఘ్నులు ఎక్కువగా అల్లరి చేసే వారనీ తులసీదాస్ కూడా తన రామచరిత మానస్ లో తెలిపాడు.

అప్పట్లో ఐదేళ్లు వచ్చిన తరువాత తప్పనిసరిగా గురువు దగ్గరకు పంపించేవారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మధ్య ఎక్కువ వయసు తేడా ఉండేది కాదు. అందువల్ల ఈ నలుగురిని దాదాపు ఒకేసారి గురువు దగ్గరకు పంపించడం జరిగింది. ఏ విషయంలోనైనా గురువుదే తుది మాట. తుది నిర్ణయం ఆయనదే. ఒకసారి గురువు దగ్గరకు పంపించిన తర్వాత తల్లిదండ్రులు జోక్యం చేసుకునేవారు కాదు. ఇక ఏ అంశాన్ని అయినా రాముడు త్వరగా నేర్చుకునే వాడు. ఒకసారి చెబితే చాలు గుర్తుంచుకునేవాడు. బాగా చురుకైన విద్యార్థి. అప్పట్లో శిష్యులు అనేవారు. మొత్తం మీద అతి తక్కువ కాలంలోనే రాముడు సీనియర్ విద్యార్థి అయ్యాడు. అందరికంటే ముందుగా అతనే విలువిద్య, మల్ల యుద్ధం తదితర పోరాట విద్యలు నేర్చుకున్నాడు. తల్లి తరువాత వశిష్టుడే వాళ్లకు చదువు చెప్పేవాడు. ఆయన వాళ్లకు అనేక కళలు, శాస్త్రాలతో పాటు, యుద్ధ విద్యలన్నీ నేర్పాడు. రాముడికి పదహారేళ్లు వచ్చిన తరువాత విశ్వామిత్రుడు వచ్చి వాళ్లకు పోరాట విద్యలను మరింత ఎక్కువగా నేర్పించడం ప్రారంభించాడు.

భాగవత కాలంలో శ్రీకృష్ణుడు ఎక్కువగా యశోద దగ్గర నుంచి, నందుడి దగ్గర నుంచి చదువు నేర్చుకున్నాడు. అతను చిన్న వయసులో అల్లరి విద్యార్థి అయినప్పటికీ, ఉదయమే లేచి స్నానం ముగించుకుని తండ్రి దగ్గరకు లేదా తల్లి దగ్గరకు వెళ్లి కొద్దిసేపు పాఠాలు చెప్పించుకునే వాడు. కృష్ణుడికి యశోద ఏం చెప్పినా పద్యాల రూపంలోనూ, పాటల రూపంలోనూ చెప్పేది. కృష్ణుడికి పాటలంటే ఎంతో ఇష్టం. కృష్ణుడికి ఏడేళ్లు వచ్చిన తర్వాత సాందీపని అనే గురువు వద్దకు పై చదువుల కోసం పంపించారు. కృష్ణుడు కూడా ఏదైనా ఒక్కసారి చెప్తే గుర్తుంచుకునేవాడట. ఒక్కసారి చెబితే చాలు అతనికి అర్థం అయిపోయేదని భాగవతం చెబుతోంది. అందువల్ల అతి తక్కువ కాలంలో అతను అనేక శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఏడేళ్ల నుంచి 16 ఏళ్లు వచ్చేవరకు అతను సాందీపని దగ్గర చదువుకున్నాడు.

ఇంతకూ రాముడు, అతని సోదరులు, కృష్ణుడు, సోదరులు తమ గురువుల దగ్గర ఏం నేర్చుకున్నారు? గురువులు వాళ్లకు ఏం చెప్పారు? రామాయణంలో దీని గురించిన వివరణ కొద్దిగానే ఉంది. కానీ భారత భాగవతాలలో మాత్రం శ్రీకృష్ణుడు చదువు గురించి, ఆయన నేర్చుకున్న అంశాల గురించి ఎక్కువ వివరాలే ఉన్నాయి. రాముడికి బాల్యంలో ఎక్కువగా నీతి సూత్రాలే బోధించారు అని రామాయణం తెలిపింది. ఇక కృష్ణుడు తాను నేర్చుకున్న చదువు లోని సారం నుంచే అర్జునుడికి బోధించే వాడని భారతం తెలియజేసింది. ఏది ఏమైనా, ఎంత ప్రతిఘటన ఎదురైనా మంచికే కట్టుబడి ఉండు. నిజాయతీ లేని వారితో, దుష్టులతో సావాసం చేయకు అనేవి కృష్ణుడు నేర్చుకున్న పాఠాలు. ఆయన తన జీవితమంతా వీటినే అంటిపెట్టుకుని ఉన్నాడు.

“మాట్లాడే ముందు బాగా ఆలోచించు. మాట్లాడిన మాటలను, వదిలిపెట్టిన బాణాన్ని వెనక్కి తీసుకోవటం సాధ్యం కాదు. గర్వం వల్ల పతనం అవుతావు. పొగరుగా వ్యవహరించటం మంచి లక్షణం కాదు. నీ పని నువ్వు చేసుకో. ప్రతి పనీ నేర్చుకో. జ్ఞానాన్నీ, విజ్ఞానాన్ని గౌరవించు. జ్ఞానుల్ని గౌరవించు. మంచి కోసం, న్యాయం కోసం పోరాడు. రాజీపడకండా పోరాడు. నీ స్నేహాలు బట్టే నిన్ను అంచనా వేస్తారని గుర్తు పెట్టుకో. చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండు. తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తినీ మర్యాదగా చూడు” వంటివి ఆయన నేర్చుకున్న సూక్తులు. రాముడు కూడా ఇటువంటి సూక్తులను వంటబట్టించుకున్నాడు. అందువల్లే మనం వారిని ఇప్పటికీ స్మరించు కుంటున్నాం.