
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9కిలో మీటర్ల దూరంలో ఈ నగునూర్ అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 400 పైగా ఆలయాలో ఉండటంతో గతంలో దీన్ని నన్నూరు గ్రామంగా పిలిచేవారు. తరువాత వాడుక భాషలో నగునూర్ గా పిలువబడుతుంది. నాటి కాకతీయులు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలించారు. ఈ గ్రామం చుట్టు రెండు ఎత్తైన కొండలు ఉండడంతో శత్రువుల రాకను పసిగట్టేవారు. కాకతీయులు పరమ శివభక్తులు కావడంతో శివుడి ఆలయాలతో పాటు నంది గ్రహాలను ఇక్కడ ప్రతిష్టాంచారు. నగునూర్లో ఇప్పటికీ కాకతీయుల నాటి ప్రతి ఆనవాళ్లు కనబడుతాయి. ఈ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తే ఎదో ఒక్క పురాతన ఆనవాలు బయటపడుతాయి. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం తవ్వకాల చేయగా పురాతనమైన నంది విగ్రహం బయటపడింది.
అయితే ఇది కాకతీయులు పాలించిన ప్రాంతం కావడంతో ఆ నంది విగ్రహం కింద నిధులు ఏవైనా ఉంటాయేమోనని గ్రహించిన కొందరు దాన్ని తవ్వి తీసేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని బయటకు తీయలేకపోయారు. దీంతో ఇలా కాదని ఆ విగ్రహాన్ని పగులగొట్టారు. ఇలా ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వీరు తవ్వకాలు చేపట్టారు. దీంతో కొందరు స్థానిక ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చారు. కొందరు గుప్త నిధుల ముఠా తవ్వకాలు చేపడుతూ పురాతన ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రాచీన గ్రామం గురించి ప్రభుత్వం పట్టించుకుంటే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తయారు చేయవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం కరీంనగర్‌కు సమీపంలో ఉండటంతో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ గ్రామాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక గ్రామంగా మార్చి పురాతన జ్ఞాపకాలను కాలగర్భంలో కలిసిపోకుండా చూడాలంటున్నారు. మన పూర్వీకుల నాటి చరిత్రను భావి తరాలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..