ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. తెలుగు రాష్ట్రాల నుంచిమాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శనానికి చేరుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటన దృష్ట్యా తిరుమల కొండపై దైవ దర్శనం కోసం వెళ్లాలంటే జంకే పరిస్థతి నెలకొంది. కాలినడక భక్తుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉంది. ఉన్నవారంతా వాహనాలను ఆశ్రయిస్తూ కొండపైకి చేరుకుంటున్నారు. కాని.. ఎన్నాళ్లీ యాతన. చేతికర్రలే భక్తులకు శ్రీరామరక్షా? చిరుతల సంచారానికి ఫుల్‌స్టాప్ పెట్టలేమా? వాటి సంచారాన్ని ట్రాక్ చేయలేమా? దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఫారెస్ట్ అధికారుల మాస్టర్ ప్లాన్ ఏంటి?
అలిపిరి కాలినడక మార్గమంటేనే ఇప్పుడు టెర్రర్‌గా మారింది. కొండపైకి వెళ్లేందుకు భక్తులు వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. కాలినడకన వెళ్తే దర్శనభాగ్యం అద్భుతంగా ఉంటుందన్న సెంటిమెంటును పక్కనబెట్టారంటే.. అది చిరుత దయవల్లే. జూన్ చివరి వారంలో ఓ బాలుడిపై చిరుత దాడి ఘటన భక్తులను ఆందోళనకు గురిచేసింది. అప్పటి నుంచి అటు అధికారులు.. ఇటు భక్తుల కంటిమీద కునుకు లేదు. కొన్ని రోజులకు అంతా సర్దుకుందనుకున్న సమయంలో.. గత నెలలో లక్షిత ఘటన ప్రకంపనలు రేపింది. తిరుమల అలిపిరి మార్గంలో 7వ మైలు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను చిరుత బలితీసుకుంది. దీంతో అలర్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం.. మెట్ల మార్గంలో ఆంక్షలు విధించింది.
అటు ఆంక్షలు కొనసాగుతుండగానే.. ఇటు బోన్లు ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులు.. చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అనుకున్నట్లుగానే.. చిరుతలు బోనుకు చిక్కాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు చిరుతలు బోనులోకి వచ్చి పడ్డాయి. ఇక్కడే చాలా మందికి ధర్మసందేహం మొదలైంది. అసలు కొండపైన ఎన్ని చిరుతలున్నాయి? వాటిలో మ్యాన్‌ఈటర్‌గా మారిన ఆ కౄర మృగమేది? ఇప్పటివరకు చిక్కిన చిరుతల్లో లక్షితను చంపిన మృగముందా? దీనిపై ఫారెస్ట్ అధికారులు స్టడీ చేస్తున్నారు.
అలిపిరి కాలిబాటకు 50 మీటర్ల దూరంలోనే 300 కెమెరా ట్రాప్స్ పెట్టామంటున్నారు తిరుపతి సర్కిల్ సీసీఎఫ్ నాగేశ్వరరావు. 100 మంది సిబ్బందితో నిరంతరం నిఘా ఉంచామన్నారు. కొండపై చిరుతల సంచారం ఎక్కువగా ఉన్న దగ్గర బోన్ల ఏర్పాటు వల్ల ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయితే ముఖ్యంగా వణ్యప్రాణులను రక్షిస్తూ.. వాటి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయకుండా.. అటు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఓశాశ్వత పరిష్కారాన్ని చూపించాలనే విషయమే ప్రధాన సవాల్. అటు టీటీడీకి.. ఇటు అటవీశాఖ అధికారులకు బిగ్గెస్ట్ చాలెంజ్‌గా మారింది.
భక్తుల చేరుల్లో కర్రలు పెట్టడం వల్ల కొంతమంది ఇబ్బందికి గురవుతున్నారు. కర్రతో పాములని చంపుతాం కాని.. చిరుతలను ఎలా వెళ్లగొడతామని ఇంకొంత మంది అంటున్నారు. నిజానికి టీటీడీ ప్రస్తుతానికి చేపట్టేవన్నీ తాత్కాలిక చర్యలే. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? చిరుతల ఆట కట్టించే మార్గమేంటి? అసలు కొండపైన చిరుతలు ఎన్నున్నాయి? శేషాచలం అరణ్యంలో మ్యాన్ ఈటర్ల మాటేంటి? దీనిపై టీవీ9తో ఎక్స్‌క్లూసివ్‌గా మాట్లాడారు తిరుపతి సర్కిల్ సీసీఎఫ్ నాగేశ్వరరావు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)