తెలంగాణ… సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. తెలంగాణ జానపదులకు.. మట్టివాసనలకు అద్దం పట్టే బతుకమ్మ. పల్లె నుంచి పట్టణం వరకు దాదాపు తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా గౌరమ్మను పూజిస్తూ జరుపుకునే ఈ పండగ.. దేశ వ్యాప్తంగా మరింత ప్రత్యేకం. పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజించే బతుకమ్మ. తొమ్మిది రోజులు.. తొమ్మిది అమ్మవార్లు.. రోజొక్క ప్రసాదం.. ఇక చివరి రోజున సద్దుల బతుకమ్మకు సత్తువ ముద్దలు చేయడం ఆనవాయితి.
పువ్వులతో ఎంతో అందంగా బతుకమ్మను పేర్చడం ఒకటి.. ఆయా రోజు దేవతలకు ఆయా ప్రసాదాలను నైవేద్యంగా ఇవ్వడం మరోకటి. పొలాల్లో నుంచి వచ్చే మక్కలు, బియ్యం, పల్లీలు, పెసలు, మినుములు, నువ్వులతో చేసిన సత్తుముద్దలంటే బతుకమ్మ అమితమైన ఇష్టమట. రకరాకల గింజలతో జతకట్టే బెల్లం, నెయ్యి కలిపి సత్తు ముద్దలు చేస్తారు. వీటిని.. నువ్వు ఉండలు, కొబ్బరి ఉండలు, పల్లీ ఉండలు అని కూడా అంటారు. ఇక ప్రారంభం రోజైనా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి చివరి రోజు సద్దుల బతుకమ్మ వరుకు నువ్వన్నం.. కొబ్బరన్నం.. వేపకాయలు… అటుకులు, బెల్లం.. వెన్న ముద్దలు.. మలీద ముద్దలు, సత్తు ముద్దలు ఇలా రోజుకో నైవేద్యం పెడతారు. మక్కలు, బియ్యం, పల్లీలు, నువ్వులను కలిపి సత్తు ముద్దలను చేస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సత్తు ముద్దలను బతుకమ్మకు నైవేద్యంగా ఆర్పిస్తారు. వీటితో ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలున్నాయి. పప్పుల్లో ప్రోటీన్స్, బియ్యం, మక్కల్లో కార్బొహైడ్రేట్స్, ఫైబర్లతోపాటు.. బెల్లంలోని సుగుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక నెయ్యి సైతం శరీరానికి కొవ్వులను అందిస్తుంది.
ముందుగా దినుసులను దోరగా వేయించి..చల్లారక మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత చక్కెర, నెయ్యి కలిపితే సత్తు పిండి సిద్ధమయినట్టే. బెల్లాన్ని లేతపాకం పట్టుకుని.. సత్తు కలిపి చేతికి నెయ్యి రాసుకుంటూ ముద్దలు కట్టుకుంటే సరిపోతుంది. సద్దుల బతుకమ్మ రోజున గౌరమ్మ ప్రసాదం సత్తు ముద్దలు రెడీ అయినట్టే. తెలంగాణలో ఒక్కొ పండగకు ఒక్కో ఆనవాయితి ఉంటుంది. ఇక రేపు సద్దుల బతుకమ్మ ఎంత అంగరంగా వైభవంగా జరగనుంది. మీరు కూడా సత్తు ముద్దలు చేసేయ్యండి.