
Kerala Unique Krishna Temple: భారతదేశం ప్రాచీన సంస్కృతి, గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక వారసత్వానికి నిలయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మన దేశంలోని అనేక దేవాలయాలు నేటికీ తమ విశేషాలు, మర్మాలు, అద్భుతాలతో భక్తులను మాత్రమే కాదు, పరిశోధకులను కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి అరుదైన ఆలయాల్లో కేరళలోని ‘తిరువరప్పు శ్రీకృష్ణస్వామి ఆలయం’ ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత విశేషమైన నమ్మకం ఏమిటంటే.. ఒక్కరోజు శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించకపోతే, గర్భగుడిలోని కృష్ణుని విగ్రహం క్రమంగా చిన్నదవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ రోజులో ఏ సమయంలోనూ నైవేద్యం ఆగదు. ఆలయం రాత్రి 9 గంటలకు మూసివేసినా, తెల్లవారుజామున 2 గంటలకే గర్భగుడి తెరచి, ఉదయం 3 గంటలకే తొలి నైవేద్యం సమర్పిస్తారు.
గ్రహణం సమయంలో కూడా గర్భగుడి మూసివేయరు.. ఎందుకంటే?
సాధారణంగా సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో దేశంలోని చాలా దేవాలయాల్లో పూజలు నిలిపివేసి, గర్భగుడి తలుపులు మూసివేస్తారు. కానీ తిరువరప్పు శ్రీకృష్ణస్వామి ఆలయంలో మాత్రం ఈ సంప్రదాయం పాటించరు. స్థానిక కథనం ప్రకారం.. ఒకసారి సూర్యగ్రహణం సందర్భంగా ఇతర ఆలయాల మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా మూసివేశారు. మరుసటి రోజు గర్భగుడి తెరిచిన పూజారులు.. కృష్ణుని విగ్రహం సాధారణం కంటే చిన్నదిగా, కాంతి తగ్గినట్లు కనిపించిందని చెబుతారు. దేవునికి సమయానికి నైవేద్యం అందకపోవడమే దీనికి కారణమని భావించారు. ఆ సంఘటన తర్వాత ఈ ఆలయంలో ‘గ్రహణం, సూతకం వంటి సందర్భాల్లో కూడా నైవేద్యం ఎప్పుడూ నిలిపివేయకూడదనే సంప్రదాయం’ కొనసాగుతోందని చెబుతారు.
పూజారి చేతిలో తాళంచెవితో పాటు సుత్తి ఎందుకు ఉంటుంది?
ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. ఆలయ ప్రధాన పూజారి ఎప్పుడూ ‘తాళంచెవితో పాటు ఒక చిన్న సుత్తిని’ కూడా వెంట తీసుకెళ్తారు.
దీనికి కారణం చాలా ఆసక్తికరం. ఒకవేళ తాళంచెవితో గర్భగుడి తలుపు తెరవడంలో ఏదైనా ఆలస్యం జరిగితే, వెంటనే సుత్తితో తాళం పగులగొట్టి అయినా గర్భగుడి తెరిచి, నిర్ణీత సమయానికి నైవేద్యం సమర్పించాలనే సంప్రదాయం ఉంది. దేవునికి నైవేద్యం ఆలస్యం కాకూడదనే విశ్వాసానికి ఇది నిదర్శనంగా భావిస్తారు.
తెల్లవారుజామున 3 గంటలకే నైవేద్యం
ప్రపంచంలోని శ్రీకృష్ణ ఆలయాల్లో తెల్లవారుజామున 3 గంటలకే తొలి నైవేద్యం సమర్పించే అరుదైన దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇందుకోసం గర్భగుడిని ఉదయం 2 గంటలకే తెరిచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. భక్తుల దర్శనార్థం ఆలయం సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.
కృష్ణుడికి నైవేద్యం ఎందుకు అంత ముఖ్యమైంది?
పురాణాల ప్రకారం, ఈ ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ‘కంసుడిని సంహరించిన అనంతరం ఉన్న రూపాన్ని’ సూచిస్తుందని చెబుతారు. ఆ యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తీవ్రమైన ఆకలితో ఉన్నాడని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ సమయానికి నైవేద్యం సమర్పించడం అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం క్రమంగా క్షీణిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడి ప్రసాదం ప్రత్యేకత ఏమిటి?
ఈ ఆలయానికి వచ్చే భక్తులు ప్రసాదం స్వీకరించకుండా వెళ్లకూడదనే సంప్రదాయం ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తే.. నవగ్రహ దోషాలు తగ్గుతాయని, గ్రహణ దోష నివారణ కలుగుతుందని, సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని, సంతాన సంబంధిత సమస్యలు తొలగుతాయని, వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయని, పాప విమోచనం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ ప్రాంగణంలోని విశేషాలు
తిరువరప్పు శ్రీకృష్ణస్వామి ఆలయం తన ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు అద్భుతమైన కేరళ శైలిలోని వాస్తుశిల్పానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలోని నాలుగు దిక్కుల్లో వివిధ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. తూర్పు దిశలో కోచంబలం దేవాలయం, ఉత్తర దిశలో శివుడు, నరసింహస్వామి, పడమర దిశలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, శాస్త (అయ్యప్ప), దక్షిణ దిశలో యక్షులు, గంధర్వుల విగ్రహాలు దర్శనమిస్తాయి.
ఈ కథనంలో పేర్కొన్న విగ్రహం చిన్నదవడం, నైవేద్యం ఆపితే జరిగే మార్పులు, దోష నివారణ వంటి అంశాలు ‘స్థానిక ఆలయ సంప్రదాయాలు, పురాణ కథనాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవే. వీటికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో లేవు. భక్తులు దీనిని ఆధ్యాత్మిక విశ్వాసంగా భావిస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)