Karungali Mala: శక్తివంతమైన కరుంగలి మాల ధరిస్తే.. మీకు తిరుగుండదు.. మంత్రాలూ పనిచేయవు..!

Ceylon Ebony: శక్తివంతమైన కరుంగాలి మాల (సీలోన్ ఎబోనీ) ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతలో బాగా ట్రెండ్ అవుతోంది. దీనిని చెడు దృష్టి, గ్రహ దోషాల నుండి రక్షణ కవచంగా చాలా మంది నమ్ముతున్నారు. అయితే, ఈ ఆధ్యాత్మిక వాదనలు ఎంతవరకు నిజం? ఈ అరుదైన చెక్క మాల వెనుక ఉన్న చరిత్ర, దాని ప్రయోజనాలు, నకిలీలను గుర్తించే విధానం, ట్రెండ్ వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Karungali Mala: శక్తివంతమైన కరుంగలి మాల ధరిస్తే.. మీకు తిరుగుండదు.. మంత్రాలూ పనిచేయవు..!
Karungali Mala

Updated on: Jan 26, 2026 | 10:27 AM

Karungali Mala: శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆభరణం ‘కరుంగలి మాల’.. ఇటీవల కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు. ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ప్రాచీనమైనది, విశిష్టమైనదిగా పేరుగాంచిన కరుంగలి (కరుంగాలి / కరుంగలి చెక్క) మాల గురించి ఇప్పడు భక్తుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు, మంత్ర–తంత్రాల భయం ఉన్నవారు ఈ మాలను ధరిస్తే విశేష రక్షణ లభిస్తుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అయితే, ఈ మాల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌, సెలబ్రిటీ ఫోటోలు, వైరల్ పోస్టులతో ఈ మాల యువతలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎంతో శక్తివంతమైనదని చెబుతున్న ఈ మాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కరుంగలి మాల అంటే ఏమిటి?

కరుంగలి అనేది ఒక అరుదైన ఔషధ గుణాలు కలిగిన చెక్కగా శాస్త్రాలలో పేర్కొనబడింది. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో, ఈ చెక్కతో తయారైన మాలను శివ భక్తులు, సిద్ధులు, యోగులు ధరించేవారని పురాణ గాధలు చెబుతున్నాయి.

కరుంగలి మాలను సిలోన్ ఎబోనీ (Ceylon Ebony) అనే అరుదైన ఎబోనీ కలపతో తయారు చేస్తారు. ఈ చెట్లు ప్రధానంగా దక్షిణ భారతదేశం, శ్రీలంకలో కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఈ చెట్లు భారతదేశంతో పాటు మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాలలో కూడా ఉన్నాయి.

‘కరుంగలి’ అనే తమిళ పదంలో కరుంగు అంటే నలుపు, అలి అంటే చెట్టు. ఈ ముదురు నల్లని కలపను సంప్రదాయంగా పవిత్రంగా భావిస్తారు. సాధారణంగా ఈ కలపతో 108 పూసల జపమాలను తయారు చేస్తారు.

కరుంగలి మాలపై ఉన్న నమ్మకాలు

తమిళ సిద్ధ సంప్రదాయంలో కరుంగలి మాలను ఒక రకమైన శక్తి కవచంగా భావిస్తారు. కొంతమంది ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం.. శని, కుజ గ్రహాల దుష్ప్రభావాలను తటస్థీకరించడంలో ఇది సహాయపడుతుందని, చెడు కన్ను, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మకం ఉంది. అలాగే, కొంతమంది భక్తులు కరుంగలి మాలను మురుగన్ ’(కార్తికేయ స్వామి)తో అనుసంధానిస్తారు. పురాణ గాథల ప్రకారం మురుగన్ ఈటె కరుంగలి కలపతో తయారు చేయబడిందనే జానపద విశ్వాసం దీనికి ఆధారం.

చాలా మంది యోగులు, సాధకులు ధ్యానం సమయంలో కరుంగలి మాలను ధరిస్తారు. ఈ కలప నుంచి వచ్చే సహజ కంపనాలు మనస్సును ప్రశాంతపరుస్తాయని నమ్మకం ఉంది. అయితే, వేదాలు. ప్రధాన పురాణాలు, ఎక్కడా కరుంగలి మాలను నేరుగా ప్రస్తావించలేదని కొందరు చెబుతున్నారు. దీని ప్రాచుర్యం ప్రధానంగా జానపద నమ్మకాలు, సిద్ధ సంప్రదాయాలపై ఆధారపడి ఉంది.

సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి కారణాలు

కరుంగలి మాల ట్రెండ్ అవడానికి ముఖ్య కారణాలు.. సెలబ్రిటీ ప్రభావం. దక్షిణ భారత నటులు, బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ మాలను ధరించడం కనిపించడం వల్ల దీనిపై ఆసక్తి పెరిగింది.  ఇది పూర్తిగా మతపరమైన చిహ్నంగా కాకుండా, స్టైలిష్ ఆధ్యాత్మిక ఆభరణంగా ప్రజలు చూడడం ప్రారంభించారు. మతానికి దూరంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతకు ఆకర్షితులయ్యే యువతకు ఇది ఒక కొత్త ఐడెంటిటీగా మారింది. ఈ జపమాల ఇప్పుడు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. ఫ్యాషన్‌ను విశ్వాసంతో కలిపిన ఆధునిక చిహ్నంగా మారిందని పండితులు అభిప్రాయపడుతున్నారు.

నిజమైనదా? నకిలీదా? ఎలా తెలుసుకోవాలి.?

ఎబోనీ కలప చాలా అరుదైనది. అంతేకాదు, అనేక దేశాల్లో దీని వ్యాపారం CITES నిబంధనలకు లోబడి ఉంటుంది. దీని కారణంగా మార్కెట్లో నకిలీ కరుంగలి మాలలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నిజమైన కరుంగలి లక్షణాలు: బరువుగా ఉంటుంది. నీటిలో వేస్తే మునిగిపోతుంది. సహజమైన లోహపు మెరుపు ఉంటుంది.

నకిలీని ఎలా గుర్తించాలి..? ఇక, నకిలీ పూసలను సాధారణంగా రంగు పూసలు, టేకు లేదా అకాసియా కలపతో తయారు చేస్తారు.

కరుంగలి మాలతో ప్రయోజనాలు

దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం
మంత్రాలు, తంత్రాలు పనిచేయవు అనే బలమైన నమ్మకం
మనసులో భయం, ఆందోళన తగ్గి ప్రశాంతత పెరుగుతుంది
ధ్యానం, జపం చేసే సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది
శివ తత్వానికి దగ్గర చేస్తుందని భావిస్తారు

ఎవరు ధరించవచ్చు?

రోజూ జపం, ధ్యానం చేసే వారు. ప్రతికూల శక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నామనే భావన ఉన్నవారు. ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లాలనుకునే భక్తులు. కరుంగలి మాల ధారణ అనేది శతాబ్దాలుగా వస్తున్న ఒక పవిత్ర సంప్రదాయం. భక్తి, నియమం, శ్రద్ధతో ధరిస్తే అది మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపుతుందని విశ్వాసం.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలు, అందుబాటులో వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)