Kanipakam Temple: చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఏడాది నుంచి ఆలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చోళుల నిర్మించిన విధంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఎన్నారై దాత ఐలా రవి 10 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పనులను ప్రారంభించారు. ఏడాది నుంచి ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే బంగారు ధ్వజస్తంభం, ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చాయి.
దీంతో చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేక మహోత్సవానికి సిద్ధమవుతున్నారు ఆలయ అధికారులు. వారం రోజుల పాటు కాణిపాకం ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చేపట్టనున్నారు. ఈనెల 21వ తేదీన మృగశిర నక్షత్రం యుక్త శుభ కన్యా లగ్నం సమయంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు విమాన గోపురం, ధ్వజస్తంభమునకు మహా కుంబాభిషేకం నిర్వహిస్తారు.
ఈనెల 15 తేదీ నుంచి 21వ తేదీ వరకు వేద స్వస్తి, గణపతి పూజ, స్వస్తి వచనం, రక్షాబంధనము, వాస్తు శాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధన కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆలయ పునర్ నిర్మాణ పనుల కోసం గత కొన్ని నెలలుగా మూల విరాట్ గర్భాలయం మూసివేశారు. దీంతో కొన్ని నెలలుగా బాలాలయంలో బాల గణపతి దగ్గరే భక్తులకు సర్వదర్శనం కొనసాగుతోంది. ఈనెల 21 నుంచి మూల విరాట్ స్వయంభు వినాయక పునర్దర్శనం భక్తులకు అందుబాటులో రానున్నది. 24వ తేదీ నుంచి మూల విరాట్ కి ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు భక్తులకి అందుబాటులో రానున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి