Yoga Day 2021 : కరోనా పై పోరాడేందుకు యోగాను ఒక సురక్షా కవచంగా మార్చుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగా ద్వారా స్వస్థత పొందుతుందని మోదీ చెప్పారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఆన్ లైన్ ద్వారా జాతి నుద్దేశించి ప్రసంగించారు. ఏడాదిన్నరగా కరోనాతో భారత్ సహా పలుదేశాలు సంక్షోభంలో చిక్కాయన్న మోదీ.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వైరస్‌తో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని తద్వారా మనలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు.
యోగా కార్యక్రమాలను భారత్ మరింత ముందుకు తీసుకెళ్లిందని చెప్పిన మోదీ.. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని వెల్లడించారు. కొవిడ్ మహమ్మారితో పోరాడగలమనే నమ్మకం మధ్య ప్రజల అంతర్గత బలానికి యోగా వనరుగా మారిందని మోదీ అన్నారు. వైరస్‌తో పోరాటానికి యోగాను ఒక సాధనంగా మార్చామని ఫ్రంట్‌లైన్ వర్కర్లు తనతో చెప్పిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యోగా తరచూ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక మార్గాన్ని ఇస్తుందని… యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, రోగనిరోధకశక్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు.
ఆన్‌లైన్ క్లాసుల్లోనూ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగా, ప్రాణాయామ వంటి వ్యాయామాలు చేయిస్తున్నారని మోదీ అన్నారు. ఇది వైరస్‌తో పోరాడటానికి పిల్లలకు కూడా సహాయపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఒత్తిడి నుంచి బలం.. ప్రతికూలత నుంచి సృజనాత్మకత వరకు ఉన్న మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధాని వెల్లడించారు. చాలా సమస్యల యొక్క పరిష్కారం యోగా చెబుతుందన్నారు మోదీ. M – యోగా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషలలో యోగా శిక్షణ వీడియోలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ఇది ‘వన్ వరల్డ్, వన్ హెల్త్’ నినాదానికి తోడ్పాటు అందిస్తుందని మోదీ వివరించారు.
Read also : International Yoga Day : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ‘ఆరోగ్యం కోసం యోగా.!’ చరిత్ర, ప్రాముఖ్యత