Hyderabad Muharram Arrangements: హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్ధం నిర్వహించే మొహర్రం సంతాప దినాలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబువుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. సంబంధిత అధికారులతో పాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది మొహరం సంతాపదినాలు పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆషుర్ ఖానా లలో మజ్లిస్, మాతం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్ధం నిర్వహించే మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని అరవై ఎనిమిది రోజుల పాటు మజ్లిస్, మాతం జరుగుతుంది. షియా ముస్లిం ప్రజలు నల్లటి దుస్తులు ధరించి ప్రతిరోజు మజ్లీస్, మాతంలో పాల్గొంటారు.
గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా మొహర్రం సంతాప దినాలు పూర్తిగా కొనసాగినప్పటికీ.. పదవ మొహర్రం సందర్భంగా నిర్వహించే బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపును జన సందోహం ఎక్కువగా లేకుండానే కొనసాగించారు. అయితే, ఈసారి ఎలాంటి కరోనా ఆంక్షలు లేకపోవడంతో బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా సాలార్జంగ్ మ్యూజియంలో మొహర్రం ఏర్పాట్లపై కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హాజరయ్యారు.
ఈనెల 9వ తేదీన ఆకాశంలో నెలవంక కనిపిస్తే..10వ తేదీ నుంచి మొహరం సంతాపదినాలు ప్రారంభం కానున్నాయని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. పదవ తేదీ నుంచి ఒకటో మొహర్రం ప్రారంభం అవుతుందన్నారు. ఈనెల 19వ తేదీన డబీర్‌పురా బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు కొనసాగనుంది. పాతబస్తీ లోని బీబీ కా అలావా నుంచి ప్రారంభమయ్యే బీబీ కా ఆలం ఊరేగింపు డబీర్పురా దర్వాజా, యాకుత్ పురా దర్వాజా, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, మదీనా మీదుగా చాదర్ ఘాట్ వరకు కొనసాగనుంది మొహర్రం సంతాపదినాలు ప్రారంభమవుతున్నందున ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ముస్లిం మత పెద్దలు పలు సలహాలు సూచనలు చేశారు.
మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్ నగరంలో ప్రశాంత వాతావరణంలో మొహర్రం సంతాప దినాలు జరుపుకోవాలని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. గతేడాది దేశంలో ఎక్కడ మొహరం సంతాపదినాల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు జరగనప్పటికీ.. హైదరాబాద్ నగరంలో బీబీ కా ఆలం ఊరేగింపు కొనసాగిందన్నారు. అయితే, ఈసారి కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఏనుగు పై బీబి కా ఆలం ఊరేగింపు కొనసాగుతున్నందున గల్లీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటూనే మజ్లిస్, మాతం నిర్వహించాలన్నారు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తగిన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంతాపదినాలు ప్రారంభానికి ముందే అన్ని ఆషుర్ ఖానాల వద్ద అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మత పెద్దలు జీహెచ్ఎంసీ అధికారులను కోరారు.
— నూర్ మహ్మద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్