పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా భక్తులు తిరుమలకొండకు భారీగా తరలి వస్తున్నారు. పవిత్ర మాసం.. పుష్ప యాగం వంటి విశేష పండగల సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 30 గంటల సమయం పడుతుంది. మరోవైపు కొండమీద భక్తులు వసతి కోసం అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొండపై ఉన్న యాత్రికుల వసతి సముదాయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.
కాగా బుధవారం రోజున శ్రీవారిని 68,995 మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజులో రూ. 3.71 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం లభించింది. 29,037 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీటిని టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..