
ప్రతి ఇంట్లో పూజా గది పవిత్రతకు నిలయం. అయితే దేవుని పటాలను, విగ్రహాలను ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజా మందిర నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, పటాలను మెరిపించే పద్ధతులపై ఆధ్యాత్మి్క పండితులు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నెలకోసారి దేవతా ప్రతిమలను, చిత్రపటాలను శుభ్రం చేసుకోవడం శుభప్రదం. అయితే కొన్ని ప్రత్యేక తిథులు, వారాల్లో ఈ పనిని చేపట్టకూడదు. మంగళవారం, శుక్రవారం చిత్రపటాలను కదపకూడదు. అమావాస్య, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శుభ్రతా కార్యక్రమాలు చేయకూడదు. ఈ ఐదు రోజులు మినహాయించి క్యాలెండర్ చూసుకుని ఇతర రోజుల్లో మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
దేవుని విగ్రహాలు, పటాలు నిత్యం ధూప దీపాల వల్ల జిగురుగా మారుతుంటాయి. వీటిని మెరిసేలా చేయడానికి కొన్ని చిట్కాలు సూచించారు. చింతపండు, కాస్త ఉప్పు లేదా పాత చింతకాయ పచ్చడితో పులికాపు చేయడం వల్ల విగ్రహాలు ప్రకాశవంతంగా మారుతాయి. పూర్వకాలంలో కాల్చిన గడ్డి బూడిదను కూడా వాడేవారు. పటాలను తడి వస్త్రంతో తుడిచి, ఆరిన తర్వాత గంధం అరగదీసి బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు రాలకుండా, మెరుస్తూ ఉండాలంటే కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కలిపి పెట్టాలి.
చాలామంది పూజ చేసిన పువ్వులను ఎక్కడ పారవేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. పువ్వులు తాజాగా ఉన్నా సరే, నిన్నటి పువ్వులను ఈరోజు ఉంచకూడదు. వాడిన పువ్వులను, మామిడి తోరణాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా మొక్కల కుండీలలో లేదా పెరట్లో మట్టిలో కప్పేయాలి. ఇది ఉత్తమమైన సేంద్రియ ఎరువుగా మారుతుంది. పొరపాటున కూడా కాళ్ల కింద పడేలా వేయకూడదు.
గుమ్మానికి పసుపు రాయడం, కుంకుమ బొట్లు పెట్టడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. పసుపు సహజమైన క్రిమిసంహారిణిగా పనిచేస్తూ క్రిములను ఇంట్లోకి రాకుండా నిలువరిస్తుంది. ఇది ఇంటికి ఒక క్రమశిక్షణను, పవిత్రమైన వాతావరణాన్ని చేకూరుస్తుంది. ఇతరులను చూసి కాకుండా తమ ఇంట్లో ఉన్న పద్ధతులను భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల శుభం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు వివరించారు.