ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవని, హోలీ పండుగకు ఆహ్వానం పలుకుతున్న భారతావని

|

Mar 27, 2021 | 2:38 PM

పండుగంటే సంబరం. సంతోషం. ఉత్సవం. ఉత్సాహం. ఓ వేడుక. ఓ తీపి జ్ఞాపిక. ఓ ఆనందవీచిక. యాంత్రికంగా సాగిపోయే జీవితాలలో పండుగ ఒక ఆడవిడుపు. మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది కాబట్టి. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది కాబట్టి. వయసుతో […]

ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవని, హోలీ పండుగకు ఆహ్వానం పలుకుతున్న భారతావని
Holi a Joyful and Colorful Festival, Holi Festival
Follow us on

పండుగంటే సంబరం. సంతోషం. ఉత్సవం. ఉత్సాహం. ఓ వేడుక. ఓ తీపి జ్ఞాపిక. ఓ ఆనందవీచిక. యాంత్రికంగా సాగిపోయే జీవితాలలో పండుగ ఒక ఆడవిడుపు. మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది కాబట్టి. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది కాబట్టి. వయసుతో సంబంధం లేకుండా అందరూ హాయిగా జరుపుకునే ఈ ఆనందకేళీ హోలీకి అనంతానంత నేపథ్యం ఉంది. ఉత్తరభారతంలో జోరుగా సాగే ఈ పండుగ దక్షిణ భారతంలోనూ హుషారు తెప్పిస్తోంది. ఇప్పుడు విదేశాల్లోనూ అందంగా పలకరిస్తూ ప్రపంచాన్ని వర్ణమయం చేస్తోంది. కరోనా కారణంగా ప్రభుత్వం వేడుకలపై ఆంక్షలు విధించింది కానీ లేకపోతే హైదరాబాద్‌లో గొప్పగా జరిగే పండుగ ఇది! ఓ నాలుగు దశాబ్దాల కిందట అయితే హైదరాబాద్‌లో హోలీ వైభవోపేతంగా జరిగేది.. రోడ్లన్నీ మోడ్రన్‌ పెయింటింగ్స్‌లా మారిపోయేవి.
వనమంతా పందిరి వేసుకున్న పచ్చదనం. మోడువారిన చెట్లు సైతం చిగురులు తొడిగే కాలం. తరువులన్ని రంగుల పూలను తొడుక్కునే మాసం. ప్రకృతి అనేక రంగులతో సింగారించుకునే సమయం. ప్రకృతిలాగే జీవితమూ వర్ణాలతో విరబూయాలని కోరుకుంటోంది హృదయం. పురి విచ్చుకున్న ఆ ఉల్లాసమే రంగుల పర్వదినం. ఆ వసంతరాగాలాపనే హోలీ వర్ణం. అది మన సంస్కృతిలో ఓ భాగం. చమ్మకేళిల సరాగం. ఏడురంగుల మేళకర్త రాగం. మన ఇంటి సంబరం. మన వాడ సంతోషం. మన దేశం సంప్రదాయం. సమస్త భారతావని సప్తవర్ణ శోభితమయ్యే ఆనందోత్సవం.

Holi a Joyful and Colorful Festival, Holi Festival

రుతువుల్లో వసంతరుతువును నేను అని చెప్పుకున్నాడు గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు. నిజంగానే ఆరురుతువుల్లో వసంతానికి సాటి మరోటి లేదు. ఆమని వచ్చిన వేళ అవని ఎంతగానో మురిసిపోతుంది. మైమర్చిపోతుంది. ఉత్సహపడుతుంది. ఉత్సవం చేసుకుంటుంది. ఆ ఉత్సవమే ఫాల్గుణోత్సవం. అదే వసంతోత్సవం. ఆ వసంతాగమనానికి ఒక్కో చోట ఒక్కోలా స్వాగతం పలుకుతూ సంబరపడిపోతుంది. కల్యాణ పూర్ణమ అన్నా, డోలా పున్నమి అన్నా, హుతశనీ పూర్ణిమ అన్నా, కాముని పున్నమి అన్నా, అనంతపూర్ణిమ అన్నా అదే వేడుక. అదే రంగుల వెదజల్లిక. హోలీ అన్నది మాత్రం జగద్విఖ్యాతి గడిచింది.

Holi a Joyful and Colorful Festival, Holi Festival

ఆ సృష్టికర్త ఎంత రసికుడు కాకపోతే ఇన్నేసి రంగులను ఎందుకిస్తాడు ? ఆ రంగులతో ఆడుకోడానికి ఇన్నేసి వేడుకలు ఎందుకు ఇస్తాడు ? రాలిపడిన జీర్ణపత్రాల చోటే కొత్త చిగురును ఎందుకిస్తాడు ? రంగుల పూలకు పరిమళాలను ఎందుకు ఇస్తాడు ? ప్రౌఢ కోయిలలకు పంచమ స్వరాలను ఎందుకిస్తాడు ? అన్నింటిని గుదిగుచ్చి అనుభూతులను ఆస్వాదించడానికి మనకు వసంతాన్ని ఎందుకు ఇస్తాడు ? నిజమే- వసంతం ఓ అనిర్వచనీయమైన అనుభవం. ఓ శ్రావ్యమైన సంగీతం. ఓ ఆహ్లాదపరిచే మధురగీతం !

Holi a Joyful and Colorful Festival, Holi Festival

చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. వేసే మొల్లల మొగ్గలు. సాగే మల్లెల కొనలు. రాలే పొగడ పుప్పొడి రేణువులు. కురిసే గోగు తేనెలు. గుత్తులెత్తే గోరంటలు. ఊరికే అనలేదు వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంది. జరుపుకుంటోంది.. జరుపుకోబోతున్నది. రంగుల కేళీ అయ్యాక నేలను చూస్తే ఓ ప్రముఖ చిత్రకారుడు గీసిన మోడ్రన్‌ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. విప్పారిన ఆనందంతో గుప్పుకునే రంగులు అసంకల్పితంగానే వర్ణచిత్రాన్ని గీస్తాయి. హోలీని ఉత్తర భారతీయులు చాలా గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని మధుర అయితే మరింత కలర్‌ఫుల్‌గా జరుగుతుంది..శ్రీకృష్ణ లీలలకు ప్రసిద్ధి చెందిన మధురలో హోలీ సందర్భంగా రాధాకృష్ణుల ఆలయాలను చక్కగా ముస్తాబు చేస్తారు. అక్కడికి జనం సమూహాలుగా చేరుకుంటారు. నృత్యగానాలతో ఆనందిస్తారు. హోలీ రోజున భంగ్ సేవించడం ఇక్కడి సంప్రదాయం. ఉత్తరప్రదేశ్‌లో బర్సానా అనే పట్టణముంది. మధురకు జస్ట్‌ 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పట్టణం. శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధ జన్మించిన ప్రాంతంగా భావిస్తారు స్థానికులు. ఇక్కడ ప్రతి పురుషుడూ కృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారు. ఇక్కడ హోలీ విచిత్రంగా, విభిన్నంగా జరుగుతుంటుంది. పండుగ రోజున స్త్రీ కర్రలు పుచ్చుకుని పురుషుల వెంటపడతారు. వెంటపడటమే కాదు కర్రలతో కొడతారు. మగవాళ్లు పాపం డాలుతో కర్ర దెబ్బలను అడ్డుకుంటారు. ఈ వేడుకను లఠ్‌మార్‌ హోలీ అంటారు. లఠ్‌ అంటే లాఠీ అన్నమాట. ఈ కొట్టడాలు, డాలుతో అడ్డుకోవడాలు అన్నీ సరదా కోసమే!

Holi a Joyful and Colorful Festival, Holi Festival

అసలీ సరదా వెనుక ఓ పురాణగాధ ఉంది. చిన్ని కృష్ణుడు ఎంత అల్లరివాడో తెలుసుగా..! ఓనాడు రాధ గ్రామానికి వెళ్లి అక్కడ రాధతో పాటు ఆమె స్నేహితురాళ్లను ఆటపట్టించాడట! అప్పటికే వెన్నదొంగ అల్లరితో సతమతమైన బర్సానా మహిళలు కర్రలతో కృష్ణుడి వెంట పడ్డారట. అప్పట్నుంచి ఈ పండుగను ఇలా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఇప్పటికీ పక్కనే ఉన్న కృష్ణుడి గ్రామం నంద్‌గావ్‌ నుంచి మగవాళ్లు హోలీ ఆడేందుకు బర్సానాకు వస్తారు.. రెచ్చగొట్టే పాటలు పాడుతూ యువతులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ వెంటనే ఆడవాళ్ల చేత లాఠీ దెబ్బలు తింటారు. ఆడవాళ్లు కూడా చాలా జాగ్రత్తగా డాలు మీదనే కర్ర దెబ్బలు వేస్తారు కానీ పొరపాటున కూడా మగవాళ్లను కొట్టరు. గమ్మత్తేమిటంటే బర్సానా అత్తగార్లు తమ కోడళ్లకు హోలీకి నెల రోజుల ముందు నుంచి పౌష్టిక ఆహారం పెడతారు! ఎందుకూ అంటే మగవాళ్లను బాగా కొట్టేందుకు! ఇక్కడ కొట్టడమంటే తమ ప్రేమను వ్యక్తపర్చడమే గానీ మరోటి కాదని గ్రామస్తులు నవ్వుతూ చెబుతారు.

Holi a Joyful and Colorful Festival, Holi Festival

బృందావన్‌లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఫాల్గునమాసం చివరి రోజున వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వేడుకను సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. పూర్ణిమకు ముందు ప్రజలందరి సమక్షంలో పురోహితుడు మంటను వెలిగించి, శుభాకాంక్షలు తెలుపుతాడు. తరువాత రోజు ఈ పండగను అంతా కలిసి రంగులతో ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇక్కడే మరో అపురూపఘట్టం ఆవిష్కృతమవుతుంది. వితంతువుల మోముల్లో రంగులు పూయిస్తుంది. ఆమని మళ్లీ వారిని ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడువారిని వారి జీవితాల్లో వసంతకేళి ఆనందోత్సవాలను నింపుతుంది. దేశంలో మరెక్కడా జరగని సంబరమిది! ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆడిపాడుతూ కేరింతలు కొడుతూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులతో పాటు రంగురంగుల పూలనూ చల్లుకుంటారు. దూరమైన పసుపు కుంకుమలే కాదు. అవనిలోని అన్ని రంగులు ఆ రోజు వారి సంతోషంలో భాగం పంచుకుంటాయి..

Holi a Joyful and Colorful Festival, Holi Festival

మరిన్ని చదవండి ఇక్కడ : పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.
బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.