
Shyamala Devi worship benefits: హిందూ పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో దేవీ ఆరాధనకు సంబంధించిన పలు నవరాత్రులు వస్తాయి. వాటిలో ప్రధానంగా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎంతో ప్రసిద్ధి. వీటితో పాటు మాఘ మాసంలో వచ్చే శ్యామల దేవి గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాఘ మాస ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనకు విశేష ఫలితాలు ఇస్తాయని విశ్వాసం.
ఈ నేపథ్యంలో శ్యామల దేవి గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? ఈ నవరాత్రుల్లో ఏ దేవతను పూజించాలి? శ్యామల దేవి స్వరూపం ఏమిటి? పూజా విధానం ఎలా ఉండాలి? వంటి ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాఘ మాసంలో వచ్చే మాఘ గుప్త నవరాత్రుల్లో ప్రధానంగా శ్యామల దేవి, అంటే మాతంగి అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతుంది. దేవి భాగవత పురాణం ప్రకారం, శ్యామల దేవి లలితా త్రిపుర సుందరి దేవికి ప్రధాన మంత్రిణిగా వ్యవహరిస్తుంది. అందుకే ఆమెను మంత్రిణి, రాజశ్యామల అనే పేర్లతో కూడా పిలుస్తారు.
మాఘ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్యామల దేవి గుప్త నవరాత్రులు జరుపుకుంటారు.
ఈ ఏడాది జనవరి 19 (సోమవారం) మాఘ శుద్ధ పాడ్యమి నుంచి జనవరి 27 (మంగళవారం) మాఘ శుద్ధ నవమి వరకు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
హిందూ సంప్రదాయంలో ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు విశేషంగా జరుపుకుంటాం. అయితే మాఘ మాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు అంతర్ముఖ సాధనకు అనుకూలంగా ఉంటాయి. ఈ తొమ్మిది రోజులూ శ్యామల దేవిని ఏకాంతంగా, నియమ నిష్ఠలతో ఆరాధించడం ద్వారా మానసిక శాంతి, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని నమ్మకం.
బ్రహ్మాండ పురాణం ప్రకారం.. లలితా త్రిపుర సుందరి దేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో తన సైన్యంలో శ్యామల దేవిని ప్రధాన మంత్రిణిగా నియమిస్తుంది. రాజ్యపాలన, రక్షణ బాధ్యతలను శ్యామల దేవికే అప్పగిస్తుంది. భండాసురుడి తమ్ముడైన విశుకృడి సైన్యాన్ని శ్యామల దేవి తన గానం, బుద్ధిబలం, వ్యూహంతో జయించి అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది. అప్పటి నుంచే శ్యామల దేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు జరపడం ఆచారంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ నవరాత్రుల్లో దేవి ఉపాసనను బహిరంగంగా కాకుండా మౌనంగా, ఏకాంతంగా, గోప్యంగా చేయడం ప్రధాన లక్షణం. అందుకే వీటిని “గుప్త నవరాత్రులు”గా పిలుస్తారు.
శ్యామల దేవి సరస్వతి దేవి స్వరూపంగా భావించబడుతుంది. అందుకే ఆమె చేతిలో వీణ ఉంటుంది. ఈమెను భక్తితో పూజిస్తే.. వాక్చాతుర్యం
సంగీతం, సాహిత్యం, లలిత కళల్లో ప్రావీణ్యం, లభిస్తాయని విశ్వాసం.
గుప్త నవరాత్రుల్లో శ్యామల దేవిని ఉపాసించిన వారికి సకల విద్యల్లో ప్రావీణ్యం, ఉద్యోగంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి లభించడం
కొత్త ఉద్యోగాలు, పదవులు, రాజకీయాల్లో, పరిపాలన రంగాల్లో ఎదుగుదల, వంటివి కలుగుతాయని నమ్మకం ఉంది. అందుకే ఉన్నత పదవులు ఆశించే వారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులను విశేషంగా పాటిస్తారు.
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులూ శ్యామల అమ్మవారిని యథాశక్తి పూజించాలి. శ్యామల సహస్రనామాలు, శ్యామలా దండకం, శ్యామల దేవి స్తుతి.. వీటిలో ఏదైనా లేదా అన్నింటినీ పారాయణ చేయవచ్చు. శ్యామల స్తుతిలో అనేక మంత్రరహస్యాలు దాగి ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పూజ అనంతరం బెల్లం పాయసం, గారెలు, చక్కెర పొంగలి, పులిహోర, పానకం, పళ్లు నైవేద్యంగా సమర్పించాలి.
చదువులో రాణించాలన్నా, వాక్శుద్ధి మెరుగుపడాలన్నా, వృత్తిలో ఉన్నత స్థాయికి చేరాలన్నా మాఘ మాసంలో వచ్చే శ్యామల దేవి గుప్త నవరాత్రులు ఒక అద్భుతమైన అవకాశం. ఈ తొమ్మిది రోజులు భక్తితో అమ్మవారిని ఆరాధించి సకల శుభాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.)