దీపావళి తర్వాత నాల్గో రోజు ప్రకృతిని పూజించే గోవర్ధన పూజ. దీనిని అన్నకూట-మహోత్సవం లేదా అన్నకూట పూజ అని కూడా పిలుస్తారు. ఈ అన్నకూట-మహోత్సవం లేదా గోవర్ధనోత్సవం అనేది భగవంతుడు తన భక్తులకు రక్షణ కల్పించేందుకు గోవర్ధన కొండను ఎత్తిన రోజును గుర్తుచేసుకునే పండుగ.
2024 గోవర్ధన పూజ తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం గోవర్ధన పూజ తిథి నవంబర్ 1 న సాయంత్రం 6.16 గంటలకు ప్రారంభమవుతుంది. దీని తర్వాత, తేదీ నవంబర్ 2 రాత్రి 8:21 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ఆధారంగా గోవర్ధన పూజ పండుగను 2 నవంబర్ 2024 న జరుపుకుంటారు.
గోవర్ధన పూజ శుభ సమయం
గోవర్ధన పూజకు ఉదయం 5.34 నుంచి 8.46 వరకు శుభ ముహూర్తం ఉంది. అంటే గోవర్ధన పూజ కోసం భక్తులకు మొత్తం 2 గంటల 12 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. దీని తరువాత గోవర్ధన పూజ రెండవ ముహూర్తం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 5:35 వరకు ఉంది. ఇందులో భక్తులకు మొత్తం 2 గంటల 12 నిమిషాల సమయం లభిస్తుంది.
గోవర్ధన పూజ విధి
గోవర్ధన పూజ కోసం ముందుగా ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత గోవర్థన పర్వతం, శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహాన్ని ఆవు పేడతో తయారు చేయండి. దీని తర్వాత విగ్రహాన్ని పూలు, రంగులతో అలంకరించండి. అనంతరం గోవర్ధన పర్వతాన్ని, శ్రీకృష్ణుడిని పూజించండి. శ్రీకృష్ణుడికి నీరు, దీపం, ధూపం, పండ్లు, కానుకలు సమర్పించండి. దీని తరువాత యాభై ఆరు ఆహార పదార్థాలు ( చప్పన్ భోగ్ ) లను నైవేద్యంగా సమర్పించండి. దీని తరువాత ఆవు, ఎద్దు , విశ్వకర్మను పూజించండి. పూజ తరువాత గోవర్ధన పర్వతానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ సమయంలో నిరంతరం కృష్ణ మంత్రాన్ని జపించండి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించండి.
గోవర్ధన పూజ ప్రాముఖ్యత
పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఒకసారి ఇంద్రుడు నందుడు నివసించే నగరంపై కోపించి భారీ వర్షం కురిపించాడు. ఇంద్రుడి కోపం నుండి గోకుల ప్రజలను రక్షించడానికి, శ్రీ కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గోవర్ధన్ పూజ పండుగను జరుపుకోవడం సంప్రాదాయంగా మారింది. ఈ రోజున శ్రీకృష్ణుని పట్ల కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ రోజు ప్రకృతి సేవ, ఆరాధనకు ప్రతి రూపంగా పరిగణించబడుతుంది.