కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు నందనం వరకు క్యూలైన్లో బారులు తీరారు. వీరందరికీ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శనివారం తిరుమలేశుడిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41 వేల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ. 4.22 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమలలో పెరిగిన రద్దీ దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 27 న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. నూతన పరకామణిని సీఎం జగన్ 28వ తేదీన ప్రారంభిస్తారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత తిరుమలలో భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సారి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం కల్పిస్తామన్నారు.
మరోవైపు.. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల కొండపై ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 26న అంకురార్పణ అనంతరం 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తిరుమలలోని ప్రధాన కూడళ్లు, పార్కుల వద్ద సుందరీకరణ పనులు ప్రారంభించారు. మాడ వీధులు, ఆలయం ఎదుట రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఆలయం ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..