
మనం సూర్య భగవానుడి చిత్ర పటం చూసినట్లయితే.. ఆయన ఒక రథంపై ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. ఒక సారథి కూడా ఉంటాడు. అయితే, సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు మాత్రమే ఎందుకు ఉంటాయి? ఆయన రథసారథి ఎవరు అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన మకర సంక్రాంతి పండగ 2026 జనవరి 14 బుధవారంనాడు జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి బయల్దేరి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే ఉత్తరాయణం ప్రారంభమని చెబుతారు. మకర సంక్రమణం అనేది ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు.. లోతైన మతపరమైన ఆధ్యాత్మికత, పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక, సూర్య భగవానుడి రథం గురించిన ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం.
పురాణాల ప్రకారం సూర్య భగవానుడి రథానికి కట్టిన ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి. సూర్య భగవానుడు స్థిరమైన కదలికలో ఉండటం ద్వారా కాలచక్రాన్ని నియంత్రిస్తాడని చెబుతారు.
ఏడు రంగుల కాంతి
శాస్త్రీయంగా సూర్యుని తెల్లని కిరణాలు నిజానికి ఏడు రంగుల మిశ్రమం. పురాణ గ్రంథాలలో ఈ ఏడు గుర్రాలు ఇంధ్రధనస్సులోని ఏడు రంగులకు సంకేతంగా చెబుతున్నాయి. వైలెట్, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు. ఇది ప్రాచీన రుషుల శాస్త్రీయ అవగాహనకు ఒక అద్భుత నిదర్శనమని చెప్పుకోవచ్చు.
వేదాలలోని ఏడు శ్లోకాలు
మరో విశ్వాసం ప్రకారం ఈ ఏడు గుర్రాలు వేదాలలోని ఏడు ప్రధాన శ్లోకాలైన గాయత్రి, భృజతి, ఉష్ని:, జగతి, త్రిస్తుప్, అనుష్టుప్, పంక్తిలను సూచిస్తాయి. సూర్య భగవానుడి రథం ఈ శ్లోకాల శక్తితో పనిచేస్తుంది.
సూర్య భగవానుడి రథాన్ని నడిపించేది సాధారణ వ్యక్తి కాదు.. అరుణుడు. అరుణుడు సూర్య భగవానుడి రథసారథి. ఆయన పక్షిరాజు అయిన గరుడుని సోదరుడు(అన్నయ్య). రథ సారథి అరుణుడు సూర్య భగవానునికి ఎదురుగా ఉంటారు. ఆయన సూర్యుని తీవ్రమైన వేడిని భరిస్తాడు. భూమిని నేరుగా చేరే తీవ్రతను తగ్గించి.. భూమి జీవరాశులను కాపాడతాడు. కాగా, సూర్యుని రథానికి ఒకే జత చక్రం ఉంటుంది. దీన్ని సంవత్సరం అని పిలుస్తారు. ఈ చక్రంలో 12 చువ్వలు ఉంటాయి. ఇవి సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి.
మకర సంక్రాంతి నాడు సూర్యుడు ధనస్సు రాశి నుంచి బయల్దేరి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళతారు. అంటే ఉత్తరం వైపు కదలిక ఉంటుంది. ఉత్తరాయణంలో దేవతల రోజు ప్రారంభమై స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని విశ్వసిస్తారు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.