పిల్లల కోసం నోములు చేయటం, వ్రతాలు ఆచరించటం ఎన్నో సార్లు మనం విని, చూసి ఉంటాము. ముఖ్యంగా కార్తీకమాసంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో గుంటుపల్లి గుహలకు మూడవ సోమవారం భక్తులు పోటేత్తుతారు. శివుడి విగ్రహం ముందు మహిళలు నిద్రపోతారు. అలా నిద్రపోయినపుడు వారికి కలలో పిల్లలు ఆడుకునే బొమ్మలు లేదా వస్తువులు కనిపిస్తే సంతామ భాగ్యం కలుగుతుందనే ఓ నమ్మకం ఉంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో శివరాత్రి రోజు అక్కడి పురాతన శివాలయంలో మొక్కలు నాటుతారు. కొబ్బరి మొక్కలు నాటితే మగ పిల్లవాడు, గులాబి మొక్క నాటితే ఆడపిల్ల పుడుతుందని విశ్వాసం.
చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈ గరుడ ప్రసాదం కోసం ఎక్కువ మందు మహిళలు వెళుతుంటారు. అయితే ఎక్కడైనా ఏడాదికి ఒక్కసారే అంటే ప్రతి ఏడు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ గరుడ ప్రసాదం భక్తులకు లభింస్తుంది. కాని ఏలూరు జిల్లా ద్వారకతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ బ్రహ్మోత్సవాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. వైశాఖమాసంలో ఒకసారి, ఆశ్వయుజ మాసంలో మరోసారి ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ద్వారకాతిరుమలలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు వేడుకగా జరుపుతారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ధ్వజస్తంభం పై ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతారు.
అయితే ధ్వజస్తంభం వద్ద గరుడ పటాన్ని ఎగరవేసే ముందు గరుడ పటంపై ఉన్న గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అర్చకులు ప్రత్యేకంగా గరుత్మంతుని కోసం గరుడ ప్రసాదాన్ని తయారుచేసి స్వామికి సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని మహిళలకు పంపిణీ చేస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేని మహిళల స్వీకరిస్తారో వారికి ఆ భగవంతుని అనుగ్రహం లభించి సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల విశ్వాసం. గరుడ ప్రసాదం కోసం సంతానం లేని మహిళలు అక్కడికి చేరుకుని అర్చకులు ఇచ్చే గరుడ ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. అర్చకులు సైతం గరుడ ప్రసాదం స్వీకరించడం సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడిందని అంటున్నారు. అయితే గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు, మూడు రోజులు తర్వాత మూడు రోజులు మహిళలు అత్యంత నిష్టగా ఉంటారు. నాన్ వెజ్ వంటకాలు పూర్తిగా వారం రోజులపాటు స్వీకరించకుండా తలస్నానమాచరించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం నిన్న అంటే 14 వ తేది రాత్రి జరిగింది. సుమారు 70 మహిళలకు ఈ ప్రసాదాన్ని పంపిణి చేశారు.