Arjita Sevas at Tirumala temple: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. కోవిడ్ ప్రభావంతో కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్న దేవస్థానం బోర్డు అధికారులు.. నెమ్మదిగా అర్జిత సేవలకు కూడా భక్తులను అనుమ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది.
శ్రీవారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ 14 నుంచి అనుమతి ఇస్తున్నందున.. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మొదటి అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించారు. భక్తులు చేసిన ఫిర్యాదులు, సూచనలను ఆయన స్వీకరించారు.
ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు.. దర్శనానికి 72 గంటల ముందు కరోనా నెగిటివ్ రిపోర్టు పొందితేనే ఆర్జితసేవల్లో పాల్గొనాలని టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గిన తరవాత కరెంట్ బుకింగ్, లక్కీడిప్ విధానంలో ఆర్జితసేవా టికెట్ల విడుదలకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏప్రిల్ 15 నుంచి వయోవృద్ధులు, పిల్లల దర్శనాలను పునరుద్ధరిస్తుమని ప్రకటించారు.
టీటీడీ గోసంరక్షణ కేంద్రాల ద్వారా గో పంచగవ్య పదార్థాలను సేకరించి ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. వాటిని తిరుపతి, తిరుమలలో విక్రయిస్తామని పేర్కొన్నారు. అమ్మకం ద్వారా వచ్చిన లాభాన్ని గోసంరక్షణకు వినియోగిస్తామని వెల్లడించారు.
తిరుమలేశుడిని ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.90.45 కోట్లు లభించింది. 76.61 లక్షలు లడ్డూలు విక్రయించారు. 6.72 లక్షలమంది తలనీలాలు సమర్పించారు. ఈ హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు రాగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారి హుండీ ఆదాయం రూ.12లక్షలు వచ్చింది అని ఈవో తెలిపారు.
అయితే టీడీపీ భక్తులకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. భవిష్యత్తులో సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మల్టీలెవెల్ కార్ పార్కింగులు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తిరుపతిలోని రెండు ప్రదేశాల్లో రెండువేలు, తిరుమలలోని రెండు ప్రదేశాల్లో 1000 నుంచి 1,500 కార్లు పట్టే మల్టీలెవెల్ కార్‌పార్కింగులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు టీటీడీ సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి తెలిపారు.