Dasara 2024: దేశంలోనే నవరాత్రులలో ప్రత్యేక పూజలు అందుకునే అమ్మవారి ఆలయాలు.. విశిష్టత ఏమిటంటే

|

Sep 19, 2024 | 10:21 AM

. త్వరలో దసరా పండగ రానుంది. దసరా అంటే మైసూర్ గుర్తుకొస్తుంది. నవరాత్రి హిందువులకు ముఖ్యంగా అమ్మవారి భక్తులకు చాలా ముఖ్యమైన పండుగ. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. కర్ణాటకలోని శృంగేరి శారదాంబ, మైసూర్‌లోని చాముండేశ్వరి, హొరనాడులోని అన్నపూర్ణేశ్వరి, మరికాంబ, కొల్లూరులోని మూకాంబిక, విజయవాడ లో కనక దుర్గమ్మ ఇలా అమ్మవారి దేవాలయాల్లో శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో నవరాత్రులలో ప్రత్యేకంగా పూజలను అందుకునే అమ్మవారి ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Dasara 2024: దేశంలోనే నవరాత్రులలో ప్రత్యేక పూజలు అందుకునే అమ్మవారి ఆలయాలు.. విశిష్టత ఏమిటంటే
Famous Temples In India
Follow us on

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. హిందువులు జరుపుకునే ఒక్కో పండుగకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాల్లో పూజలు చేయడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ముందు తరాలకు అందజేస్తున్నారు. మన దేశంలోని దేవాలయాల్లో కృష్ణుడు, రాముడు, శివుడు, గణపతి, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు మాత్రమే కాకుండా దేవతలను కూడా పూజిస్తారు. అమ్మవారిని నవరాత్రులలో అత్యంత శ్రద్దలతో పుజిస్తారు. త్వరలో దసరా పండగ రానుంది. దసరా అంటే మైసూర్ గుర్తుకొస్తుంది. నవరాత్రి హిందువులకు ముఖ్యంగా అమ్మవారి భక్తులకు చాలా ముఖ్యమైన పండుగ. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. కర్ణాటకలోని శృంగేరి శారదాంబ, మైసూర్‌లోని చాముండేశ్వరి, హొరనాడులోని అన్నపూర్ణేశ్వరి, మరికాంబ, కొల్లూరులోని మూకాంబిక, విజయవాడ లో కనక దుర్గమ్మ ఇలా అమ్మవారి దేవాలయాల్లో శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో నవరాత్రులలో ప్రత్యేకంగా పూజలను అందుకునే అమ్మవారి ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. దేవతల ప్రధాన ఆలయాల జాబితా ఇక్కడ ఉంది.

అన్నపూర్ణేశ్వరి దేవి- హొరనాడు

హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో భద్ర నది ఒడ్డున ఉంది. చతుర్భుజ దేవత అన్నపూర్ణేశ్వరి ఇక్కడ రెండు చేతులలో శంఖచక్రాన్ని, మరో చేతిలో శ్రీచక్రాన్ని, నాల్గవ చేతిలో గాయత్రిని పట్టుకుని దర్శనమిస్తుంది. హొరనాడు క్షేత్రం అన్నదానానికి ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారిని చాలా దగ్గరగా చూడవచ్చు. 1973లో ఆరు అడుగుల ఎత్తైన రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని తమిళనాడులోని శంకోట్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. విగ్రహం దిగువన మూలాదేవి ఉంది. హొరనాడు క్షేత్రం అగస్త్య మహర్షిచే స్థాపించబడిందని ఒక పురాణం. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఏడాదికోసారి అమ్మవారికి నైవేద్యంగా బియ్యం, కాయలు, కాఫీ, యాలకులు, ఎండుమిర్చి తదితరాలను సమర్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మూకాంబిక దేవాలయం- కొల్లూరు

కొల్లూరు మూకాంబిక ఆలయం కర్ణాటకలోని ఉడిపి జిల్లా , షిమోగా జిల్లా సరిహద్దులో ఉంది. ఆమెను ఆది శక్తి అని అంటారు. మూకాంబిక దేవాలయం శక్తి దేవతలలో ఒకరు కనుక ఇక్కడ నవరాత్రుల సమయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

చాముండేశ్వరి ఆలయం- మైసూర్

మైసూరులో దసరా చాలా ప్రత్యేకం. ఈ సందర్భంగా ఇక్కడ చాముండి కొండపై ఉన్న చామండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాముండేశ్వరి పురాణ నేపథ్యం కలిగిన దేవత. ‘దేవి మహత్యం అనే పురాణంలో ప్రధాన దేవత. చాముండేశ్వరి అమ్మవారు ఈ కొండపై నివసించే మహిషాసురుడిని సంహరించినట్లు దేవి మహత్యంలో వర్ణించబడింది. అప్పటి నుంచి ఈ కొండకు చాముండి కొండ అని పేరు వచ్చింది.

వైష్ణో దేవి ఆలయం – జమ్మూ కాశ్మీర్

జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం ఉత్తర భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన, పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఉత్తర భారతదేశంలోని వైష్ణో దేవి ఆలయం హిందువులకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఈ వైష్ణో దేవతకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. త్రికూట పర్వతం వద్ద ఉన్న వైష్ణోదేవి ఆలయంలో నవరాత్రులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వైష్ణో దేవిని మహా కాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి సంగమంగా భావించి పూజిస్తారు.

కామాఖ్య దేవి ఆలయం – అస్సాం

అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇది 51 శక్తిపీఠాలలో ముఖ్యమైనది. ఈ ఆలయానికి సుమారు 6 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా సందర్శించే దేవాలయాలలో ఇది ఒకటి.

జ్వాలాముఖి ఆలయం- హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న దుర్గా దేవాలయం అత్యంత పురాతన ఆలయం. ఇక్కడ జ్వాలా దేవి పూజలను అందుకుంటుంది. ఈ జ్వాలా ముఖి దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. విశేషమేమిటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదు. బదులుగా ఇక్కడ ఎప్పుడూ అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు ఈ పవిత్ర స్థలానికి తరలివస్తారు.

నైనా దేవి ఆలయం- హిమాచల్ ప్రదేశ్

నైనా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉంది. నైనా దేవిని ఇక్కడ ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక్కడ అగ్నిలో దూకి సతీదేవి ప్రాణ త్యాగం చేసిందని పురాణాల కథనం.

కాళీఘాట్ – పశ్చిమ బెంగాల్

ఈ ఆలయం పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా సమీపంలో హుగ్లీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ కాళీకా దేవిని ప్రధానంగా భవతారిణి రూపంలో పూజిస్తారు. ఇక్కడ జరుపుకునే నవరాత్రులు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందాయి.

కర్ణి దేవి ఆలయం – రాజస్థాన్

రాజస్థాన్‌లోని బైకార్నర్‌లోని కర్ణి దేవి ఆలయంలో దాదాపు 20,000 ఎలుకలు ఉన్నాయి. ఇవి దేవతకు సహాయకులని నమ్ముతారు. ఇక్కడ నవరాత్రి వేడుకలు ప్రత్యేకం.

దంతేశ్వరి ఆలయం- ఛత్తీస్‌గఢ్:

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేశ్వరి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి దంతం రాలిపోవడం వల్ల దంతేశ్వరి అనే పేరు వచ్చింది. నవరాత్రుల పవిత్ర దినాలలో ప్రజలు అమ్మవారిని పూజించడానికి కొండ కొనల నుంచి వస్తారు. అలాగే ఈ నవరాత్రులలో దంతేశ్వరి దేవి విగ్రహాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఊరేగిస్తారు.

మహాలక్ష్మి ఆలయం- మహారాష్ట్ర

ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉంది. మూడు అడుగుల పొడవు 40 కిలోల బరువున్న నల్లరాతితో మహాలక్ష్మి దేవి విగ్రహం ఉంది. ఈ ఆలయం అంబాబాయి దేవికి అంకితం చేయబడింది. చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణం కూడా ప్రత్యేకం.

చక్కలతుకవు దేవాలయం- కేరళ

కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో నవరాత్రులలో అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పరశురాముడు సృష్టించిన నూట ఎనిమిది ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ భగవతిని దేవతగా పూజిస్తారు.

అంబాజీ టెంపుల్-గుజరాత్
అంబాజీ టెంపుల్ గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో మౌంట్ అబూపై ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ అంబాజీ ఆలయం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయం. 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ విగ్రహాలు ఉండవు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి