Sankranti Brahmotsavam : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఆలయంలో రుద్రహోమం, పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మళ్లికాగుండంలో వైదిక శాస్త్రోక్తంగా అవబృదస్నానం చేయించిన అనంతరం… వసంతోత్సవాన్ని జరిపించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చతుర్వేదసభ, ఘనస్వస్థి కార్యక్రమాలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన వేదపండితులు సామవేదం, ఋగ్వేదం, అదర్వణవేదం, యజుర్వేద పఠనాన్ని నిర్వహించారు. సామాన్యులకు సైతం వేద సారాలు అర్ధమయ్యేలా వేదసభ నిర్వహించడంపై భక్తులు ఆనందం వ్యక్తంచేశారు.
పండితులకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రంతోపాటు నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించినట్లు స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ఉత్సవాల్లో ఆఖరిరోజైన ఆదివారం స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి ప్రాకారోత్సవం.. పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించనున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.