అమ్మా బైలెల్లింది.. సల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు బోనంతో బారులు తీరారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు వైభవంగా మొదలయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనంను సమర్పించారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆలయానికి చేరుకున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లష్కర్ తొలిబోనాన్ని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి సమర్పించారు. ఉదయం 4 గంటల సమయంలో మంత్రి తలసాని కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
ఈ ఏడాది బోనాల జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రజలను సల్లంగా చూడాలని…కరోనా బారి నుంచి బయటపడేలా అమ్మవారు అనుగ్రహించాలని కోరుకున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లను చేశామన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిల్చునున్నారు. బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ మాస్కులు అందజేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.