Balapur Ganesh: 1994లో రూ. 450లతో మొదలైన వేలం.. బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదీ..!

Balapur Ganesh 2022: భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డు. నిమజ్జనం రోజున ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ తీవ్రంగా

Balapur Ganesh: 1994లో రూ. 450లతో మొదలైన వేలం.. బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదీ..!
Ganesh Nimajjanam
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 09, 2022 | 8:39 AM

Balapur Ganesh 2022: భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డు. నిమజ్జనం రోజున ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ తీవ్రంగా ఉంటుంది. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలు పలుకుతుంది ఈ లడ్డూ. ఏ ఏటికా ఏడు రికార్డులను చెరిపేసుకుంటూ 2021లో జరిగిన వేలంలో ఏకంగా 18 లక్షల 90 వేలు దక్కించుకుంది. మరి ఇవాళ జరగబోయే లడ్డూ వేలంలో రికార్డు ధర పలుకుతుందా..? ఇంతకీ ఈ లడ్డూ కథ ఏంటో చూద్దాం?

గణేష్‌ బప్పా.. మోరియా.. ఆదా లడ్డూ తేరా..! విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎదురుచూస్తారు. ఎంత ధరైనా వెచ్చిస్తారు. 27 ఏళ్లుగా లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకున్న బాలాపూర్‌ గణేశుడు.. ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకేత్తించింది.

గతేడాది కూడా బాలాపూర్‌ లడ్డూ రికార్డ్‌ సృష్టించింది. 18.90 లక్షల రూపాయల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధికంగా వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో పలకవచ్చని ఉత్సవ సమితి భావిస్తోంది. 9 రోజులపాటు విశేష పూజలందుకున్న బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలం ఈ యేడాది మరింత ఘనంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. లడ్డూవేలంపాటలో 18 మంది శాశ్వత సభ్యులు, లడ్డూ దక్కించుకున్న స్థానికేతరులను ఉత్సవసమితి సత్కరించి.. లడ్డూవేలం పాట నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట..వందలు వేలు దాటి..రికార్డుస్థాయిలో లక్షలు పలుకుతోంది. స్థానికులు, స్థానికేతరుల మధ్య వేలంపాట నువ్వా..నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. గతేడాది రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. 2019లో బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ. 7.50 లక్షలు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలు, 2014లో సింగిరెడ్డి జయేందర్‌రెడ్డి రూ. 9.50 లక్షలు, 2015లో కళ్లెం మదన్‌మోహన్‌ రూ. 10.32 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. ఇక 2016లో మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్‌ రెడ్డి రూ. 14.65 లక్షలకు దక్కించుకున్నారు. 2017లో తిరుపతిరెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డూను వేలం పాటలో కైవసం చేసుకున్నారు. 2018లో శ్రీనివాస్‌గుప్తా రూ. 16.60 లక్షలకు దక్కించుకున్నారు. అత్యధికంగా బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబీకులే లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు.

ఇదిలాఉంటే, 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్‌ గణపతి నిమజ్జన వేడుకలు ఈ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఆఖరిపూజ పూర్తిచేసుకున్న లంబోదరుడు గ్రామ ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్​పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగిస్తారు. 9 గంటలకు గణపతి ప్రధాన కూడలి వద్దకు చేరుకోగానే వేలంపాట కొనసాగుతుంది. వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న వ్యక్తిని సన్మానించిన తర్వాత ..ట్యాంక్‌బండ్‌ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తానికి ఈ ఏడాది కూడా బాలాపూర్‌ గణేశుడి లడ్డూవేలంలో పాత రికార్డులు బద్దలై.. కొత్త హిస్టరీ క్రియేట్‌ అవుతుందని భావిస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..