Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Jagannath Bahuda Yatra 2026: పూరీ జగన్నాథ రథయాత్రలో అత్యంత కీలక ఘట్టమైన బహుదా యాత్ర నేడు జరుగుతోంది. గుండిచా ఆలయం నుంచి శ్రీమందిరానికి తిరిగి వచ్చే జగన్నాథ స్వామి ప్రయాణంలో పోడా పిఠా నైవేద్యం, సునా బేష్, ఆధార్ పానా, నీలాద్రి బిజే వంటి విశిష్ట ఆచారాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకోండి.

Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?
Jagannath Bahuda Yatra 2026

Updated on: Jul 24, 2026 | 3:06 PM

Bahuda Yatra Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమైన ఈ మహోత్సవంలో, జగన్నాథ స్వామి తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాతో కలిసి గుండిచా ఆలయానికి (మేనత్త ఇంటికి) రథాలపై వెళ్లారు. తొమ్మిది రోజుల పాటు అక్కడ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం, ఇప్పుడు స్వామివారు తిరిగి శ్రీమందిరానికి చేరుకునే పవిత్ర యాత్రను బహుదా యాత్ర అని పిలుస్తారు. ఆషాఢ శుక్ల దశమి రోజున నిర్వహించే ఈ తిరుగు ప్రయాణం రథయాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. ఈ సందర్భంగా అనేక సంప్రదాయ క్రతువులు, విశిష్ట ఆచారాలు నిర్వహించబడతాయి. అవేంటో తెలుసుకుందాం.

బహుదా యాత్రకు ముందు ‘పోడా పిఠా’ నైవేద్యం

శ్రీమందిరానికి తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు గుండిచా ఆలయంలో జగన్నాథ స్వామికి ఒడిశాకు ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం ‘పోడా పిఠా’ను నైవేద్యంగా సమర్పిస్తారు. బియ్యం, కొబ్బరి, బెల్లంతో తయారయ్యే ఈ ప్రత్యేకమైన వంటకం స్వామికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ నైవేద్యం అనంతరం మహాప్రభువు రథంపై అధిరోహించి శ్రీమందిరం వైపు బయలుదేరుతారు.

సునా బేష్.. బంగారు అలంకారంలో మహాప్రభువు

శ్రీమందిరానికి చేరుకున్న తర్వాత జరిగే అత్యంత ఆకర్షణీయమైన వేడుక ‘సునా బేష్’ (రాజరాజేశ్వర బేష్). ఇది సాధారణంగా ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రా దేవిని బంగారు కిరీటాలు, హారాలు, చేతులు, పాదాలు, నడుము పట్టీలు వంటి విలువైన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. రాజసంగా అలంకరించిన స్వామివారు రథంపైనే భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ.

ఇవి కూడా చదవండి

ఆధార్ పానా.. అరుదైన సంప్రదాయం

సునా బేష్ అనంతరం జరిగే మరో విశిష్టమైన ఆచారం ‘ఆధార్ పానా’. ఈ సందర్భంగా పాలు, పన్నీర్, పంచదార, అరటిపండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలతో తయారుచేసిన ప్రత్యేక పానీయాన్ని పెద్ద మట్టి కుండల్లో నింపి స్వామివారి పెదవుల వరకు తీసుకువెళ్తారు. అనంతరం ఆ కుండలను పగులగొడతారు. ఆ కుండల్లోని నైవేద్యాన్ని రథాలపై నివసించే అదృశ్య దేవతలు, పార్శ్వదేవతలు, చండీ-చాముండి వంటి శక్తులు స్వీకరిస్తాయని విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని సాధారణ భక్తులకు పంపిణీ చేయరు.

నీలాద్రి బిజే.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే ఘట్టం

రథయాత్ర ముగింపులో జరిగే చివరి ముఖ్యమైన ఆచారం ‘నీలాద్రి బిజే’. ఈ సందర్భంగా జగన్నాథ స్వామి తిరిగి శ్రీమందిరంలోని గర్భగుడిలో ప్రవేశిస్తారు. పురాణాల ప్రకారం, తొమ్మిది రోజుల పాటు గుండిచా ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు.. అయితే, ఈ విషయాన్ని లక్ష్మీదేవికి చెప్పకుండా చేస్తాడు. తనకు చెప్పకుండా, తనను తీసుకెళ్లకుండా శ్రీ మందిరాన్ని విడిచి వెళ్లినందుకు లక్ష్మీదేవి ఆగ్రహిస్తారు. ఈ క్రమంలోనే ఆమె కోపాన్ని శాంతింపజేయడానికి స్వామివారు ఆమెకు ‘రసగుల్లాలు’ సమర్పిస్తారని విశ్వాసం. అనంతరం శాంతించిన లక్ష్మీదేవి ఆలయ ద్వారాలను తెరిచి స్వామివారిని తిరిగి ఆలయంలోకి ఆహ్వానిస్తారు. ఈ ఆచారంతో రథయాత్ర మహోత్సవం అధికారికంగా ముగుస్తుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన వివరాలు పూరీ జగన్నాథ ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆగమ, స్థానిక ఒడియా సంప్రదాయాలు, పురాణ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ప్రాంతానుసారం ఆచారాల నిర్వహణలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.)

Follow Us