కోట్లాది హిందువుల కల తీరుతూ రామ జన్మ భూమి అయోధ్యలో తన గుడిలో రామయ్య కొలువు దీరి త్వరలో మొదటి వార్షికోత్సవ వేడుకలను జరుపుకోనుంది. అయోధ్య రామయ్య దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. నిత్యం రద్దీతో నిండిపోతుంది. ముఖ్యంగా హిందువుల పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లో రామయ్య దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలో బుధవారం నూతన సంవత్సరం మొదటి రోజు భక్తుల రద్దీ కనిపించింది. అలాయంలో మాత్రమే కాదు అయోధ్య పట్టణంలో కూడా యాత్రికుల రద్దీతో ఓ రేంజ్ లో సందడి నెలకొంది. దాదాపు 500 ఏళ్ల కలను నెరవేరుస్తూ రామ జన్మ భూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకుని.. గర్భ గుడిలో బాల రామయ్య గతేడాది జనవరి 22న కొలువు దీరాడు. మహాసంప్రోక్షణ జరిగింది.
అప్పటి నుంచి అయోధ్య నిత్యం రద్దీతోనే ఉంటుంది. అయితే ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మొదటి సారి జరుపుకుంటున్న రామయ్య దర్శనం కోసం లక్షలాది మంది పోటెత్తారు. స్థానిక పరిపాలన అంచనాల ప్రకారం.. కొత్త సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రెండు లక్షల మందికి పైగా భక్తులు విదిచేశారు. జనవరి 1 వ తేదీ బుధవారం ఉదయం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు బాల రామయ్యను దర్శించుకున్నట్లు చెప్పారు. ఏడాది తొలిరోజు ఆవిష్కృతమైన విగ్రహం ‘దర్శనం’ కోసం బారులు తీరారు.
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటోందని రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. వింటర్ సీజన్‌తో పాటు సెలవులు కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనం కోసం వచ్చేందుకు ఆసక్తిని చూపించారని ఆయన వివరించారు.
ప్రజలు వరసగా సెలవులు వస్తే ఇప్పటి వరకూ గోవా, నైనిటాల్, సిమ్లా లేదా ముస్సోరి వంటి సాంప్రదాయ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేవారు.. అయితే ఇప్పుడు అయోధ్య యాత్రికులకు ప్రధాన గమ్యస్థానంగా మారింది” అని ఆయన అన్నారు. అయోధ్య పరిపాలన అధికారులు రద్దీని నియంత్రించడానికి నగరాన్ని బహుళ సెక్టార్‌లు, జోన్‌లుగా విభజించారు. రద్దీని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, 24 గంటలూ వాహన తనిఖీలు నిర్వహించామని స్థానిక అధికారులు తెలిపారు.
ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31 న భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం సాయంత్రానికి రెండు లక్షల మందికి పైగా యాత్రికులు దర్శనం పూర్తి చేసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పట్టణంలోని హోటళ్లు, ధర్మశాలలు, హోమ్‌స్టేలు పూర్తిగా బుక్ అయ్యాయి. భక్తుల సౌకర్యార్ధం రామజన్మభూమి మార్గంలో 10 అదనపు సందర్శకుల గ్యాలరీలను అధికారులు సిద్ధం చేశారు. దర్శన మార్గాల సంఖ్యను 10 నుండి 20కి పెంచారు. భక్తుల భద్రతను పర్యవేక్షణ కోసం ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేశారు.
అయోధ్య డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ తివారీ మాట్లాడుతూ నగరాన్ని ఏడు భద్రతా విభాగాలుగా మరియు 24 జోన్‌లుగా విభజింనట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలో సీనియర్ అధికారులను మోహరించారు. రద్దీగా ఉండే ప్రదేశాలను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించినట్లు.. రద్దీని నివారించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ ను నియంత్రించినట్లు వెల్లడించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..