దేశమంతా అయోధ్య వైపే చూస్తోంది.. ఈ నెల 22 న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ.. భక్తులు వివిధ రూపాల్లో తమ వంతుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. దేశంలోనే దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుండి ఖమ్మం జిల్లా బీజేపీ నేత నంబూరి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ రామ రథాన్ని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రాంభించారు. ముందుగా రామానుజ జీయర్ స్వామి విగ్రహంతో పాటు ఎంతో ప్రాముఖ్యత గల భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ముత్యాల తలంబ్రాలను రామాలయ అంతరాలయం చుట్టూ ప్రదక్షణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాచలం నుండి అయోధ్యకు బయలుదేరిన శ్రీరామ రథం ఈ నెల 21 తేదీన అయోధ్య చేరుకుంటుంది.
ఈ నెల 22 న అయోధ్యలో రామ భక్తులకు ఎంతో విశిష్టత గల భద్రాచలం ముత్యాల తలంబ్రాలను అందించనున్నారు. భద్రాచలం ముత్యాల తలంబ్రాల ప్రాముఖ్యతను వివరిస్తూ 20 వేల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు అందించి, రాముడు వనవాసం చేసిన భద్రాచలం పరిసర ప్రాంతంతో పాటు రామాలయం విశిష్టత తెలియ పరిచే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీరామ రథం యాత్ర ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..