Kanakadurga Theppotsavam: బెజవాడ దుర్గమ్మ భక్తులకు నిరాశ.. ఈసారి ఆ భాగ్యం దక్కనట్లే..

|

Oct 14, 2021 | 5:38 PM

Bejawada kanakadurga: బెజవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దయింది. కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యం కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

Kanakadurga Theppotsavam: బెజవాడ దుర్గమ్మ భక్తులకు నిరాశ.. ఈసారి ఆ భాగ్యం దక్కనట్లే..
Vijayawada Kanakadurga Matha Theppotsavam
Follow us on

Bejawada Kanakadurga Theppotsavam: బెజవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దయింది. కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యం కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్ననవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అవతారంలో కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు. 8వ రోజైన ఇవాళ శ్రీమహిషాసురమర్ధిని అవతారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.. ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు, ఆంక్షల నడుమ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

దేవీ శరన్నవరాత్రుల చివరి రోజైన విజయదశమినాడు సాయంత్రం దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.. అయితే, ఈసారి ఈ వేడుకలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అధ్యక్షతన జరిగిన కో ఆర్డినేషన్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే, తెప్పోత్సవం లేకున్నా.. శుక్రవారం సాయంత్రం కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు యధాతథంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు కలెక్టర్‌.. మరోవైపు నవరాత్రుల చివరి రెండు రోజులు విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నామరని సిటీ పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. తెప్పోత్సవం లేదనే వార్త తెలిసి భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు.
Read Also… MLA Vidudala Rajani: చిలకలూరిపేటలో ఫ్లెక్సీ తెచ్చిన తంటా..! కొత్త చిక్కుల్లో ఎమ్మెల్యే రజనీ..