Yadadri Brahmotsavam: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పుణ్యక్షేత్రం సిద్ధమైంది. ఈనెల 25 వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవపర్వాలకు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది కూడా కొండపైన తాత్కాలిక బాలాలయ గడపలోపలే ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.
సోమవారం ఉదయం విశ్వక్సేనుడి పూజ, స్వస్తివచనం, సాయంత్రం అంకురార్పణ, మృత్సంగ్రహణ కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు. 16న ధ్వజారోహణం, 21న స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 22న ఉదయం 11 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
కళ్యాణోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.అదేవిధంగా టీటీడీ తరపున ముత్యాల తలంబ్రా లు, పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 23న స్వామివారి దివ్య వాహన రథోత్సవం, 24న మహాపూర్ణాహుతి, చక్రతీర్థ పూజలు, 25న అష్ఠోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహోత్సవాల సందర్భంగా 11 రోజులపాటు బాలాలయంలో స్వామివారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు..