
అక్షయ తృతీయ.. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ శుక్ల పక్ష తృతీయ నాడు వచ్చే ఒక పవిత్రమైన పండుగ. హిందువులు, జైన సంప్రదాయాలలో దీనికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అది దిగ్విజయం అవుతుందని.. అక్షయంగా (క్షయం లేకుండా) వృద్ధి చెందుతుందని గట్టి నమ్మకం. అక్షయ అంటే నాశనం లేనిది అని, తృతీయ అంటే మూడవ రోజు అని అర్థం.. శుక్ల పక్షం వృద్ధికి శుభకారకంగా భావిస్తారు.
అక్షయ తృతీయకు చారిత్రక, పురాణ నేపథ్యం ఎంతో ఉంది. నాలుగు యుగాలలో ముఖ్యమైన త్రేతాయుగం ఈ రోజే ప్రారంభమైందని చెబుతారు. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించినది కూడా ఇదే శుభ తిథి అని పురాణాలు పేర్కొంటున్నాయి. వేదవ్యాసుడు గణపతి సహాయంతో మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజునే. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన సుధాముని కలుసుకున్న రోజు కూడా ఇదే. భగీరథుని ప్రయత్నంతో పవిత్ర గంగానది భూమిపై ప్రవహించడం ప్రారంభించిన సమయం, అలాగే పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపదికి అక్షయ పాత్ర సిద్ధించిన రోజుగా కూడా ఈ తృతీయను చెబుతారు. అక్షయ పాత్ర అంటే ఎన్నటికీ తరగని ఆహారాన్ని అందించేది, కోరుకున్న వస్తువులను అనుగ్రహించేది అని అర్థం.
ఈ పవిత్రమైన రోజున పుణ్యతీర్థాల సందర్శనం, పుణ్య స్నానాలు చేయడం, ఉపవాసాలు ఉండటం అనాదిగా వస్తున్న ఆచారం. గణపతి, శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు, కుబేరుడు వంటి దేవతామూర్తులను ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వాసం. వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, స్థలాలు కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం ఒక ప్రధాన ఆచారంగా మారింది. ఇది చాలా మందికి వచ్చే సందేహం. కనీసం పిసరంత బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సిరిసంపదలు తులతూగుతాయని తరతరాలుగా వస్తున్న నమ్మకం. భారతీయులు బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.. కాబట్టి దానిని శుభప్రదంగా చూస్తారు. పూజల్లో బంగారాన్ని ఉంచి ఆరాధించడం కూడా జరుగుతుంది. అక్షయ తృతీయ నాడు అత్యంత శుభప్రదమైన ముహూర్తంలో బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో శుభాలు, ఐశ్వర్య వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. ఇది కేవలం అలంకరణ వస్తువుగా కాకుండా, ఆర్థిక పెట్టుబడిగా, కుటుంబానికి అత్యవసర సమయాల్లో ఆదుకునే ఆస్తిగా భారతీయులు భావిస్తారు.
అయితే, అందరూ బంగారం మాత్రమే కొనాలనే నిబంధన లేదు. తమ స్తోమతకు తగినట్లుగా వెండి, వజ్రాలు, నవరత్నాలు లేదా ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేయడం, లేదా ఏదైనా శుభసూచకమైన కొత్త పనిని ప్రారంభించడం కూడా అక్షయ ఫలాలను ఇస్తుందని చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వచ్చింది. పెట్టుబడులు, కొనుగోళ్లకు ఈ రోజు మంచిదిగా భావించబడడం వల్ల ఆభరణాల దుకాణాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ షాపులు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తాయి. మిగతా రోజులతో పోలిస్తే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.