Vijayasai Reddy: కృష్టా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి కృష్టా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. అలాగే అన్ని ప్రాజెక్ట్‌లకు సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రతను కల్పించి చట్టం ప్రకారం వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను విజయసాయి కేంద్రమంత్రికి వివరించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఆవశ్యకత గురించి కేంద్రమంత్రికి వివరించిన విజయసాయి.. కూలంకుషంగా చర్చించి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించవలసిందిగా కోరారు. ఈ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విజయసాయి రెడ్డి మీటింగ్ అనంతరం చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కృష్టా జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ వంటివి ఏ విధంగా చట్ట విరుద్ధమైనవో కేంద్రమంత్రికి సోదాహరణంగా వివరించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
విశాఖపట్నం జిల్లా గ్రామీణ ప్రాంతాల ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లాలోని నరవ వరకు పైపు లైన్ ద్వారా తాగు నీటిని తరలించే ప్రాజెక్ట్‌ను తలపెట్టినట్లు విజయసాయి రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లారు. 126 కిలో మీటర్ల దూరం పైపు లైన్ ద్వారా 12 టీఎంసీల తాగు నీటిని తరలించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు 3573 కోట్లు ఖర్చవుతుంది.. జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్ట్ వ్యయంలో సగం భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని విజయసాయి, కేంద్రమంత్రిని కోరినట్టు వెల్లడించారు.
Read also: Kakani: చంద్రబాబు చతికిలపడితే… జగన్ వచ్చి చకచకా చర్యలు తీసుకున్నారు : కాకాణి