సాగునీటి ప్రాజెక్టులపై లోటస్‌పాండ్‌లో విమర్శలు.. షర్మిలది అమాయకత్వమా?.. అజ్ఞానమా? అంటున్న పాలమూరు శ్రేణులు
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రత్యేక ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు వైయస్ షర్మిల పూనుకున్న విషయం తెలిసిందే. రోజుకో జిల్లా వైయస్ అభిమానులతో..
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రత్యేక ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు వైయస్ షర్మిల పూనుకున్న విషయం తెలిసిందే. రోజుకో జిల్లా వైయస్ అభిమానులతో భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ విధి విధానాలపై వివిధ రంగాల నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుపై షర్మిల స్పీడ్ పెంచారు. రోజుకో జిల్లా అభిమానులతో సమావేశమవుతున్న ఆమె… తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈరోజు లోటస్ పాండ్‌లో మహబూబ్‌నగర్ శ్రేణులతో మాట్లాడిన షర్మిల.. ఆ జిల్లా వలసలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లా సమస్యలపైనా ఆరా తీశారు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 80శాతం కట్టిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాకపోవడమేంటని షర్మిల ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం… ప్రభుత్వంపై మండిపడ్డారు. భీమ, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలకులే పాలమూరును వలసల జిల్లాగా మార్చేశారని ధ్వజమెత్తారు.
ఇక కాంగ్రెస్ పార్టీనీ టార్గెట్ చేశారు షర్మిల మద్దతుదారులు. పాలమూరు కష్టాలపై మాట్లాడే నాయకులు కరువయ్యారని విమర్శించారు కొండా రాఘవరెడ్డి. ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారాయన. మరోవైపు పార్టీ అనౌన్స్‌మెంట్‌పై క్లారిటీ వచ్చింది. వచ్చే నెల 9న షర్మిళ పార్టీపై ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత జూలై 8న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని.. సభా వేదికగా పార్టీ విధి విధానాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.
అయితే మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై షర్మిల మాట్లాడటంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకోవాలి. అంతే కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎలా. అమాయకత్వం అనాలా?.. అజ్ఞానం అని సరిపెట్టుకోవాలా?. మహబూబ్ నగర్ జిల్లా నేతల సమావేశంలో షర్మిల చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. కోహినూర్ వజ్రం పుట్టిన పాలమూరు జిల్లాలో వలసలేంటని ప్రశ్నించారు షర్మిల.
కోహినూర్ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కొల్లూరు వజ్రాల గనుల్లో.. ఈ విషయం అందరికీ తెలుసు. ఇంటర్నెట్‌లో వెదికినా తెలుస్తుంది. ఇంత చిన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా.. కోహినూర్ పుట్టిన పాలమూరు జిల్లా అని షర్మిల చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలు ఉన్నాయని, దుబాయి, బొగ్గుబాయి, ముంబాయి అంటూ పాత పాట బాగా అరిగిపోయిన రికార్డుని రిపీట్ చేశారు. ఈ పరిస్థితి తలచుకుంటే కడుపు తరుక్కుపోతోందంటూ షర్మిల అనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు.
షర్మిల గతంలో పాదయాత్ర చేసినప్పటితో పోలిస్తే ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పరిస్థితులు మారాయి. కృష్ణా నది మీద ఏర్పాటు చేసిన ఎత్తి పోతల పథకాలతో పాలమూరు రూపం సమగ్రంగా మారిపోయింది. పల్లెలకు రివర్స్ వలసలు మొదలయ్యాయి. నీరు సమృద్ధిగా ఉండటంతో వలస వెళ్లిన వాళ్లంతా వెనక్కి వస్తున్నారు. ఈ విషయం షర్మిలకు తెలియదా అంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
ఇక పార్టీ ఏర్పాటు చేయడానికి ముందు రోజున ఎల్బీ స్టేడియంలో 3లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ లీకులు ఇస్తుంది షర్మిల టీం. అసలు ఎల్బీ స్టేడియం కెపాసిటీనే 30వేలు. మహా అయితే ఇంకో పదివేల మందిని అడ్జస్ట్ చేయవచ్చు. అంత చిన్న స్టేడియంలో 3 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం సాధ్యమేనా. ఆ మాత్రం అవగాహన లేదా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
విద్యార్థులతో షర్మిల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో..సునంద్ జోసెఫ్ చేసిన మెలో డ్రామా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది… ఈసీన్‌లో షర్మిలతో మాట్లాడిన సునంద్ జోసెఫ్ విద్యార్థి కాదు. ఓ చర్చ్‌లో కీ బోర్డ్ ప్లేయర్ అని గతంలో హరీష్‌రావుతో కలిసి ఫోటోలు దిగాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మెలో డ్రామాలతో తెలంగాణను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నేరుగానే విమర్శలు గుప్పించారు.
పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చాక ఎవర్నైనా అంటాం. ఏమైనా అంటాం అన్నారు శ్రీశ్రీ. పబ్లిక్ లైఫ్‌లో ఉన్న నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ట్రోలింగ్‌కు ఎవరూ అతీతం కాదు. ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల్ని కూడా టార్గెట్ చేస్తోంది సోషల్ మీడియా. బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్‌లో దిగి.. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాస్త గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు తెలుకుంటే మంచిదనేది నెటిజన్ల సలహా ఇస్తున్నారు.
Read more: