మాటల్లో పదును పెంచారు వైఎస్ షర్మిల. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంలోని నిబంధనలు వివరిస్తూ ఆమె ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వారికి ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ 26.11 లక్షల మందికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోర్టులు చెబితే తప్ప బాధ్యతలు గుర్తుకు రావని, ప్రజలు ప్రశ్నిస్తేనే పనులు చేస్తారని వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినా.. పేదలకోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చడం చూస్తుంటే భవిష్యత్తులో ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కన పెట్టి ఆయుష్మాన్ భారత్‌నే అమలు చేస్తారనే అనుమానం కలుగుతోందని వైఎస్ షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన 80 లక్షల పేద కుటుంబాలకు నిజంగా మంచి చేయాలన్న ఆలోచనే ఉంటే.. కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్యశ్రీలో కూడా చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ వల్ల లబ్దిపొందేది కేవలం 26 లక్షల 11 వేల కుటుంబాలు మాత్రమేనని, మరి మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏంటని ఆమె సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.