వచ్చే మే నాటికి ఏపీ శాసనమండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం పడబోతుఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉండటం వల్లే అసంతృప్తులు లేవని చెప్పారు. మండలిలో మందబలంతో ఇంతకాలం టీడీపీ వ్యవహారించిన తీరును ప్రజలు గమనించారని చెప్పారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం వైయస్ జగన్ బీ- ఫామ్ ఇచ్చారు. సీఎం శ్రీ జగన్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక్బాల్, కరీమున్సీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య కలిశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం, పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి సమపాళ్లలో సముచిత స్థానాలు ఇవ్వటం వల్లనే ఎక్కడా చిన్నపాటి సమస్య కూడా ఉండటం లేదన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పార్టీలో అందరూ గుర్తించారు. అందుకే.. మిగిలిన పార్టీల్లో మాదిరిగా.. రాజకీయ సంస్కృతిలో భాగంగా ఉండే ఊహాగానాలు, అసంతృప్తులు వంటివి వైయస్‌ఆర్‌సీపీలో కనిపించవని అన్నారు. ఇది జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలబడుతుందని సజ్జల తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని ప్రజలంతా గమనించారని సజ్జల చెప్పారు. వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారన్నారు. వచ్చే మేతో వైయస్‌ఆర్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ చేసే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపు అందుకుంటాయన్నారు సజ్జల. సమీప భవిష్యత్‌లో అదీ పూర్తి అవుతుంది. ఎంపికైన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అభినందనలు తెలిపారు.
Read More:
రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు.. బంద్‌కు సంఘీభావం తెలిపిన వైసీపీ