Kadiyam Vs Rajaiah : ఆ లీడర్లదిద్దరిదీ ఒకే నియోజకవర్గం. రాజకీయంగా ఒకే కారులో ప్రయాణం. జెండా ఒకటే..కానీ ఎజెండాలే వేర్వేరు. ఇప్పుడు కాదు ఎప్పట్నించో వాళ్లిద్దరి మధ్య ఆధిపత్యపోరు. అవకాశమొస్తే ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. తూటాల్లాంటి డైలాగులు విడుస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎంలైన ఆ నేతలిద్దరి మధ్య ఎందుకంత వైరం? అంటే.. ఇప్పుడిద్దరూ ఒకే పార్టీ కానీ.. ఒకప్పుడు రాజయ్య కాంగ్రెస్. కడియం టీడీపీ. అప్పట్లోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఒకే పార్టీజెండా నీడన ఉన్నా.. ఒకే ఒరలో రెండు కత్తుల్లా ఇమడలేకపోతున్నారు. అవకాశమొచ్చినప్పుడల్లా మాటల కత్తులు దూస్తున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గంలో కబడ్డీ పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చిన కడియం…పరోక్షంగా రాజయ్యపై విమర్శలు గుప్పించారు. నెత్తి మీద పది రూపాయలు పెడితే చెల్లనివారు మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు. నో కామెంట్ అంటూనే కడియం శ్రీహరితో తన విభేదాలు ఇప్పటివి కావని దేవాదుల వ్యవహారాన్ని గుర్తుచేస్తున్నారు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని, ఏమన్నా ఉంటే అధిష్ఠానమే చూసుకుంటుందంటున్నారు తాటికొండ రాజయ్య.
టీవీ9తో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కడియం శ్రీహరి పై పరోక్ష విమర్శలు గుప్పించారు. “నడిచే ఎద్దుకే ముళ్ళు కర్ర.. పండ్లున్న చెట్టుకే రాళ్లు. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలు వాళ్ళకి ఉంటాయి. కేసీఆర్ సర్వే చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు గొప్పనో.. చంద్రబాబు నాయకత్వం లో కడియం పనిచేసినప్పుడు జన్మభూమి లో జరిగితే కొన్ని పనులు జరగొచ్చు. కాని నేను కేసీఆర్ నాయకత్వం లో అంతకు మించి పనులు చేస్తున్న. సాగునీటి రంగంలో స్టేషన్ గన్ పూర్ నంబర్ 1 గా ఉంది. ఇందిరమ్మ ఇల్లు అన్ని నా హయం లోనే వచ్చాయి. ఆయన నాపైన చేసిన వ్యాఖ్యలకు నేను స్పందించను. అధిష్టానం మా నాయకులు చూసుకుంటారు. ఎవరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది.” అని రాజయ్య టీవీ9తో వెల్లడించారు.
Read also : Palla Rajeswara Reddy : నల్గొండ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకున్న టీఆర్ఎస్, పల్లా రాజేశ్వరరెడ్డి విజయం