గన్నవరం వైసీపీలో ట్రయాంగిల్ పోరు.. పీక్స్‌కు చేరింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. అధికార వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో.. అప్పటికే ఉన్న దుట్టా, యార్లగడ్డ గ్రూపులకు మరో గ్రూపు తోడైంది. దీంతో, ముచ్చటగా మూడు గ్రూపులన్నట్టు.. వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల ఈ మూడువర్గాల మధ్య పోరు మరింత ముదిరింది. వంశీతో కలిసి నడిచేది లేదంటూ.. కుండ బద్దలు కొట్టేశాయి దుట్టా, యార్లగడ్డ వర్గాలు. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన వైసీపీ హైకమాండ్ సజ్జలను రంగంలోకి దించింది. ఆయన ఇరువర్గాలతో వేర్వేరుగా మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మేటర్ సజ్జల దగ్గరికి వెళ్లే ముందు యార్లగడ్డ, దుట్టా వర్గం ఏమాట్లాడారో.. భేటీ తర్వాత కూడా అదే స్థాయిలో వంశీపై విరుచుకుపడ్డారు. వంశీతో కలిసి పనిచేసేది లేదంటూ తేల్చి చెప్పేశారు. గతంలో జగన్ పై ఇష్టానుసారం మాట్లాడిన వంశీతో ఎలా కలిసి పనిచేస్తామని ప్రశ్నించారు. ఆత్మగౌరవం చంపుకొని వంశీ వెంట తిరగలేమని చెప్పారు.
అధిష్టానం చెప్పినా తగ్గేదెలె అని దుట్టా అంటుంటే…. నో కాంప్రమైజ్ అంటున్నారు ఎమ్మెల్యే వంశీ. ఇప్పటికే తాను అందరినీ కలుపుకొని వెళ్తున్నాననీ… అనవసరంగా తనపై వ్యాఖ్యలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చిల్లరవాళ్ళతో గొడవలు, సంబంధాలు పెట్టుకోకూడదంటూ… పరోక్షంగా దుట్టాపై మండిపడ్డారు.
గన్నవరం పార్టీలో గలాటా ముదరడంతో.. ఇష్యూని వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. నేతలు ఎంత చెప్పినా వినకపోవడంతో.. సోమవారం ఇరువర్గాలతో మరోదఫా మాట్లాడాలని నిర్ణయించింది. మరి, ఆరోజైనా ఈ గొడవలకు పుల్‌స్టాప్ పడుతుందా? లేక నేతలు షరామామూలుగానే రచ్చ చేస్తారా? అనేది చూడాలి.