Private Hospitals : కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పక్క రాష్ట్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తుంటే.. తెలంగాణలో మాత్రం దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం అటు ఆయుష్మాన్ భారత్ కానీ, ఆరోగ్య శ్రీ కానీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనాకు ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ఉచితంగా వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రయివేటు ఆస్పత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఫైరయ్యారు. అంతేకాదు, కరోనా నివారణకు మందులు, ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్లు అసలే లభించడంలేదని, డబ్బులు పెట్టినా బెడ్స్ లేవని,ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో అనేక ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని ఉత్తమ్ అన్నారు. రెమిడిసివర్ మందు హెటిరో కంపెనీ హైదరాబాద్ లో తయారు చేస్తుందని, ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని అయినా… మనకు రెమిడెసివర్ ఇంజక్షన్లు లభించడం లేదని ఆయన విమర్శించారు.