Chinta mohan : తిరుపతి పార్లమెంట్ నియోజయవర్గ బై పోల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతామోహన్ జోరు పెంచారు. వాళ్లనీ వీళ్లనీ కాదు.. డైరెక్ట్‌గా సీఎం జగన్‌నే టార్గెట్ చేశారు. కుటుంబానికి న్యాయం చేయని వాళ్లు రాష్ట్రానికేం మేలు చేస్తారని ఆరోపణాస్త్రాలు సంధించారాయన. జగన్ చెల్లెలు షర్మిళ.. చిన్నాన్న కూతురు సునీతా ఎందుకు ఆక్రోషిస్తున్నారో చెప్పాలంటూ చింతా మెహన్ ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. తిరుపతిలో ధర్మయుద్ధం అంటూ జరిగితే గెలిచేది కాంగ్రెస్సేనని జోస్యం చెప్పారు చింతా. అంతేనా, మరో ఆరు నెలలే జగన్ సీఎంగా ఉంటారంటూ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లయినా ఎందుకు కేసు ముందుకు సాగడం లేదని చింతా మోహన్ ప్రశ్నించారు. ఈ హత్యకు బాధ్యత ఎవరిది? తన చిన్నాన్న హత్యపై సీఎం జగన్ నోరు విప్పాలని చింతా డిమాండ్ చేశారు. సొంత సోదరి.. వివేకా కూతురు మాటలకు జగన్ 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ఆయనను అనుమానించాల్సి వస్తుందంటూ తీవ్రమైన సందేహాలకు తెరలేపారు. ధర్మయుద్ధంలో జగన్ గెలవలేరన్న ఆయన, గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే ఈసారి బీజేపీ కూడా పడుతుందని చెప్పుకొచ్చారు.
అధిక ధరలు దాని పతనానికి ప్రధాన హేతువని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్ చేస్తున్న ప్రచారం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, అదంతా వృథా ప్రయాస అని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ కోటి రూపాయలు ఖర్చుచేసిందని.. ఈ డబ్బంతా ఎక్కడిదని ఆయన వైసీపీని ప్రశ్నించారు.