TELANGANA PARTIES: ఉరకలెత్తే ఉత్సాహంతో తెలంగాణ రాజకీయ పార్టీలు.. మోదీ సెంట్రిక్‌గా బీజేపీ.. రాహుల్ డిక్లరేషన్‌తో టీ.కాంగ్రెస్.. మరి టీఆర్ఎస్?

| Edited By: Ram Naramaneni

May 23, 2022 | 7:23 PM

ప్రజలను కలిసేందుకు, తామేంటో చెప్పుకుంటూనే తమ ప్రత్యర్థి పార్టీల మైనస్ పాయింట్లను ఏకరువు పెట్టేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు.

TELANGANA PARTIES: ఉరకలెత్తే ఉత్సాహంతో తెలంగాణ రాజకీయ పార్టీలు.. మోదీ సెంట్రిక్‌గా బీజేపీ.. రాహుల్ డిక్లరేషన్‌తో టీ.కాంగ్రెస్.. మరి టీఆర్ఎస్?
Revanth Reddy Cm Kcr Bandi Sanjay
Follow us on

TELANGANA PARTIES ON FULL SWING BJP CONGRESS TRS PREPARINIG FOR ELECTIONS: తెలంగాణలో పొలిటికల్ పార్టీలు చురుకుగా మారాయి. ఏ అవకాశం వచ్చినా జనం మధ్యకు వెళ్ళేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ ప్రణాళికలకు అనుగుణంగా ప్రజలను కలిసేందుకు, తామేంటో చెప్పుకుంటూనే తమ ప్రత్యర్థి పార్టీల మైనస్ పాయింట్లను ఏకరువు పెట్టేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు.  ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కే.చంద్ర శేఖర్ రావు(CM Kcr) జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే సంకల్పంతో ఉత్తరాదిన పర్యటిస్తుంటే.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సంకల్పంతో టీఆర్ఎస్(Trs) పార్టీలో నెంబర్ టూ కేటీఆర్(KTR) దావోస్(Davos)తరలివెళ్ళారు. కేసీఆర్, కేటీఆర్ లిద్దరు వ్యూహాత్మక పర్యటనల్లో వుండగా.. టీఆర్ఎస్ మంత్రులు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు యత్నిస్తున్నారు. ఇందులో ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్(Minister Harish Rao) ముందు వరుసలో కనిపిస్తున్నారు. ఇక ప్రధాన మంత్రిగా ఎనిమిదేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ(PM Narendra Modi) పిలుపు మేరకు గత 8 ఏళ్ళలో చేపట్టిన పథకాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు రూపొందించుకుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు జనం మధ్యకు వెళ్ళబోతున్నారు.  ఇక మే మొదటివారంలో రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు వరంగల్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు సంసిద్దమయ్యారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు తమ తమ కార్యక్రమాలలో ప్రజల్లోకి వెళుతుండడంతో తెలంగాణ పాలిటిక్స్(Telangana Politics) ఎన్నికలు రేపా మాపా అన్న రీతిలో ఆసక్తికరంగా మారాయి.

నిజానికి తెలంగాణలో ఎన్నికలు ఇప్పుడప్పుడే లేవు. కేసీఆర్ వ్యూహాత్మక కదలికల కారణమో లేక 2018 అనుభవమో కానీ.. తెలంగాణలో అధికారంలోకి వద్దామనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరు నెలల క్రితమే యాక్టివ్ అయ్యాయి. ధాన్యం సేకరణ అంశంపై ఎవరి వెర్షన్ వారు వినిపిస్తూ దాదాపు 2,3 నెలలు ప్రజల్లో సంచరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోయగా.. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు గుమ్మరించాయి. చివరికి ధాన్యం సేకరణకు రాష్ట్రమే రెడీ అయిపోవడంతో ఇష్యూ సద్దుమణిగింది. కానీ..  విపక్ష పార్టీలు మాత్రం ధాన్యం సేకరణ అంశంపై రాజుకున్న పొలిటికల్ హీట్‌ని వచ్చే ఎన్నికల దాకా కొనసాగించాలనే నిర్ణయించాయి. దానికి అనుగుణంగా వ్యూహాలు రచించాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే రెండు విడతలుగా సంజయ్ పాదయాత్ర పూర్తయ్యింది. తొలి విడతపై పెద్దగా ప్రజాకర్షణ కనిపించకపోయినా రెండో విడతలో బండి సంజయ్ దూకుడు ప్రదర్శించారు. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ వద్ద ప్రారంభించిన రెండో విడత పాదయాత్ర నెల రోజులు కొనసాగి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ముగిసింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద మే అయిదో తేదీన జరిగిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఆ తర్వాత మే 14న తుక్కుగూడ వద్ద జరిగిన పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోం మంత్రి, బీజేపీలో నెంబర్ 2 అమిత్ షా హాజరయ్యారు. కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను గద్దె దింపే సత్తా బండి సంజయ్‌కి వుండని చాటారు. ఆ తర్వాత వారం రోజులు చిన్నా చితకా కార్యక్రమాలలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఇపుడు ప్రధాని పదవిలో మోదీ ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళేందుకు తెలంగాణ కమలం శ్రేణులు రెడీ అవుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రచార పర్వాన్ని కొనసాగించబోతున్నారు. ఆ తర్వాత జూర్ 20 నుంచి 23 మధ్యలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు. మూడో విడత పాదయాత్రలో యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి ఆలయం దాకా పాదయాత్ర చేయాలని సంజయ్ సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా మే మాసం కొత్త ఉత్సాహాన్ని నింపింది. దానికి అనుగుణంగా ముమెంటమ్‌ని కంటిన్యూ చేసేందుకు టీపీసీసీ రెడీ అయ్యింది. మే ఆరు, ఏడు తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటించి వెళ్ళిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆరో తేదీన వరంగల్ బహిరంగ సభలో రాహుల్ ఇచ్చిన పిలుపు, జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా టీపీసీసీ కార్యచరణ రూపొందించింది. ప్రజలతో మమేకం అయితేనే పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రాహుల్ కుండబద్దలు కొట్టడంతో ఆ దిశగా కాంగ్రెస్ నేతలు సమాయత్తమయ్యారు. చాన్నాళ్ళుగా రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన నేతలు సైతం తమ బళ్ళ రూటు మార్చి, గేరు వేసి తామెంచుకున్న నియోజకవర్గాల దిశగా మళ్ళించారు. దానికి తోడు రాహుల్ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేలా ప్రణాళిక సిద్దం చేసింది. డిక్లరేషన్‌లోని 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం, తగినంత స్థాయిలో కనీస మద్దతు ధర వంటి అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టీపీసీసీ పార్టీ వర్గాలను ఆదేశించింది. మరోవైపు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇటీవల ఉదయ్‌పూర్ వేదికగా నిర్వహించిన చింతన్ శిబిర్ తరహాలో తెలంగాణ కాంగ్రెస్‌లోని అన్ని అంశాలను చర్చించుకుని, వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపొందించుకునేందుకు జూన్ తొలివారంలో తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీపీసీసీ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇలా అన్ని పార్టీలు తమతమ కార్యాచరణతో దూకుడు ప్రదర్శిస్తుండడంతో తెలంగాణ పాలిటిక్స్‌లో చురుకుదనం ఉరకలెత్తుతోంది.