కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు . కృష్ణా జలాలపై ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. నారాయణపేటకు 10 కి.మీ. దూరంలోనే కర్నాటక ఉందని, ఆ రాష్ట్రంలో తెలంగాణలో అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? అని ప్రశ్నించారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కర్నాటకలో ఉన్నాయో లేవో చెప్పాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని వివరించారు. ఊహించని విధంగా వరి పంట పండింది.. రైతుల దగ్గర పంట కొన్నాము అని తెలిపారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు.
నారాయణపేటకు జలాలు రావాలంటే ప్రజాభిప్రాయ సేకరణకు రావాలన్నారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. నారాయణపేటలో పట్టణ ప్రగతి పనులు వేగంగా జరుగుతున్నాయని, నారాయణపేటలోనే 2100 విద్యుత్ స్తంభాలు, 19 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి ముందు తరాలకు మంచి భవిష్యత్‌ను అందివ్వాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. వైరలవుతోన్న వీడియో