Gangula Kamalakar Vs Etela Rajender : ఈటల రాజేందర్ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కరీంనగర్‌ను బొందలగడ్డగా మార్చినట్లు తనపై ఈటల ఇవాళ హుజురాబాద్ లో విమర్శలు చేయడంపై గంగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన గంగుల.. “హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి.. మరి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత గ్రానైట్ పరిశ్రమలను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు?” అంటూ ఈటలకు కౌంటరిచ్చారు. గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కైయ్యారా? అని గంగుల ప్రశ్నించారు. తమిళనాడు వాసులు గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కరీంనగర్‌లో 350 గ్రానైట్ క్వారీలు ఉంటే.. గంగుల కమలాకర్‌కు ఒక్కటే గ్రానైట్ క్వారీ ఉందని.. . ఆ క్వారీ తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఉందన్న విషయం తెలుసుకోవాలని ఈటలకు గంగుల సూచించారు. అంతేకాదు, తాను పన్నులు ఎగ్గొట్టానని ఈటల విమర్శలు చేస్తున్నారని.. తాను ఎక్కడైనా పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు అధికంగా చెల్లిస్తానని గంగుల సవాల్ విసిరారు. “అసైన్డ్ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారు.. సిగ్గుంటే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయాలి” అని గంగుల డిమాండ్ చేశారు. ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరన్న ఆయన.. తాను కూడా బీసీ బిడ్డనే.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఈటల కంటే తనకు ఆత్మగౌరవం ఎక్కువన్న మంత్రి గంగుల.. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామన్నారు. కార్యకర్తలను ఈటల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.