సమ్మర్ హీట్‌ని ఓవర్ టేక్ చేస్తున్న తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. విజయంపైనే ప్రధాన పార్టీల ఫోకస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపైనే 3ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. 6ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న ఈపోరులో అధికార, విపక్షాలు తమదైన శైలీలో వ్యూహాలు రచిస్తున్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:16 pm, Sun, 28 February 21
సమ్మర్ హీట్‌ని ఓవర్ టేక్ చేస్తున్న తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు..  విజయంపైనే ప్రధాన పార్టీల ఫోకస్
MLC Election Campaign

MLC Election Campaign: తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు సమ్మర్ హీట్‌ని ఓవర్ టేక్ చేస్తున్నాయి. 2ఎమ్మెల్సీ స్థానాల్లోనే ఎన్నికలు జరుగుతున్నప్పటికి…మెజారిటి జిల్లాల‌ను క‌వ‌ర్ చేస్తుండ‌టంతో అన్ని పార్టిలు ఈ ఎన్నిక‌ల‌ను సీరియస్‌గా తీసుకున్నాయి. పార్టిల‌న్ని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని హోరేత్తిస్తున్నాయి. న‌ల్లగొండ‌-వ‌రంగ‌ల్-ఖ‌మ్మం గ్రాడ్యూయేట్ కోటాకు సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డినే తిరిగి ఎంపిక చేయడంతో ఆ సీటు గెలవడం ఖాయమనే కాన్ఫిడెన్స్‌లో ఉంది అధికార పార్టీ. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానంలో విద్యావంతురాలు, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభీవాణిదేవిని నిలబెట్టడంతో ఇక్కడా విజయం తమదేనన్న ధీమాలో ఉంది టీఆర్ఎస్.

అధికార టీఆర్ఎస్ వ్యూహ‌లు ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. వ‌రంగ‌ల్-ఖ‌మ్మం-న‌ల్లగొండ స్థానానికి గుజ్జుల ప్రేమేంధ‌ర్ రెడ్డిని అభ్యర్ధిగా నిలబెట్టింది. హైద్రాబాద్, రంగారెడ్డి, మ‌హబుబ్ న‌గ‌ర్ స్థానాన్ని సిట్టింగు ఎమ్మెల్సీ రామ‌చంద్రరావుకే మళ్ళి ఆవ‌కాశం ఇచ్చింది. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, నిరుద్యోగభృతి ఇవ్వలేదన్న కారణాలతోనే టీఆర్ఎస్‌ని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందాలని చూస్తోంది కమలం పార్టీ.

బీజేపీ  ఆపరేషన్ ఆకర్షను, టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారానికి తట్టుకొని గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ ఖ‌మ్మం, వరంగ‌ల్, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్‌ని…రంగారెడ్డి-మ‌హ‌బుబ్ న‌గ‌ర్-హైద్రాబాద్‌లో సినియ‌ర్ నేత చిన్నా రెడ్డి ను బ‌రిలోకి దింపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకే తమకు కలిసొస్తుందన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌. ఉద్యోగాల భర్తీ, గ్రాడ్యూయెట్స్ నిరుద్యోగులకు నిరుద్యోగభృతిపై మాట నిలబెట్టుకోలేని టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గ్రాడ్యూయేట్స్ ఓట్లడిగే అర్హత లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత బీజేపీకి లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి …బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నెంబర్‌ వన్ రాష్ట్రం అంటూ శాలువాలతో సరిపెడుతుందే తప్ప ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి చేపట్టడం లేదన్నారు. నిధులు మంజూరు చేయడం లేదన్నారు. పిచ్చి మాటలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్న బీజేపీ నేతలకు జ్ఞానదోయం కలిగించాలని గ్రాడ్యుయేట్స్‌కు పిలుపునిచ్చారు.

అధికార టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఉపాధి, విద్యా సమస్యలపై చర్చకు తాము సిద్ధమంగా ఉన్నామని ..దీనిపై మార్చి 1న ఉదయం 11గంటలకు ఓయూ ఆర్స్ట్ కాలేజీలో చర్చకు రావాలని మంత్రి కేటీఆర్‌కి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచంద్రరాపు.

ప్రధాన పార్టీలు ఎవరి కాన్ఫిడెన్స్‌లో వాళ్లుంటే తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐ, స్వతంత్ర్య అభ్యర్ధులు అంతే ధీటుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వాళ్లున్నారు. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.