RDS controversy: నీళ్లే నిప్పయి మండుతున్నాయి. ప్రాంతాల మధ్య అగ్గిపుట్టిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ షురూ!

|

Jun 23, 2021 | 11:01 AM

రాజోలుబండ వివాదం రాజుకుంటోంది. జల జగడం మళ్లీ ముదురుతోంది. తెలుగు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

RDS controversy: నీళ్లే నిప్పయి మండుతున్నాయి. ప్రాంతాల మధ్య అగ్గిపుట్టిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ షురూ!
శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.
Follow us on

Pothireddypadu, RDS controversy: రాజోలుబండ వివాదం రాజుకుంటోంది. జల జగడం మళ్లీ ముదురుతోంది. తెలుగు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. నీళ్లు మంటల్ని ఆర్పుతాయి.. పచ్చని పంటకు జీవం పోస్తాయి. కానీ ఇక్కడ నీళ్లే నిప్పయి మండుతున్నాయి. ప్రాంతాల మధ్య అగ్గిపుట్టిస్తున్నాయి. జల జగడాలు కొత్త రగడ రాజేస్తున్నాయి. నిన్న ప్రశాంత్‌రెడ్డి కామెంట్స్‌ కాక పుట్టిస్తోంది.. ఏపీ రియాక్షన్‌ ఉత్కంఠ రేపుతోంది.

నీటి యుద్ధాలు కొత్త కాదు. నీళ్ల పంచాయితీలకూ అంతమూ లేదు. కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనుగడలో ఉండగా ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్ల చుట్టూ. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన అంశాల్లో నీళ్లే ప్రధాన ఎజెండా. పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నీళ్లకే పెద్దపీట వేసింది. గోదావరిపై ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం వంటి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌తో అనుకున్న లక్ష్యాన్ని దాదాపుగా సాధించింది.

ఇప్పటిదాకా ఓకే.. అంతా సాఫీగానే ఉంది. కృష్ణా బేసిన్‌కు వచ్చే సరికి అసలు వివాదం తెరపైకి వస్తోంది. అటు ఏపీ.. ఇటు తెలంగాణ మధ్య ఘర్షణ మళ్లీ మొదటికొస్తోంది. ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌తో పాటు ఆర్డీఎస్‌ విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

అటు,కృష్ణానదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఆంధ్రప్రదేశ్. అనుమతులు లేని ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు యోచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రాజెక్టులపై న్యాయ నిపుణులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈనెల 30న జరిగే కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు.. కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దూకుడుగానే ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. మాటలే కాదు చేతల్లోనూ అదే స్పీడ్‌ కనబరుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణపై ఎన్‌జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ లేఖ రాశారు. ఏపీ చర్యలతో కరువుకు తోడు.. ఫ్లోరైడ్‌ ప్రాంతాలపై ప్రభావం పడుతుందని రజత్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

అటు, ఏపీ.. ఇటు తెలంగాణ మధ్య ఘర్షణ మళ్లీ మొదటికొస్తోంది. ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌తో పాటు ఆర్డీఎస్‌ విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అసలు గొడవంతా కృష్ణా జలాలపైనే. కృష్ణాలో నీటి లభ్యత తక్కువ. ఏటా కృష్ణాకు వరద తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ చేపట్టిన పలు ప్రాజెక్టులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇటు వైపు, అటు వైపు నుంచి మంత్రుల స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్టీఎస్ విస్తరణ పనులతో మొదలైన ఈ జగడం మరింత పెద్దదవుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన ఘాటు కామెంట్స్‌ అగ్గిరాజేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణానికి తెరదీశాయి.

రాయలసీమ ఎత్తిపోతల.. ఆర్డీఎస్‌ కేంద్రంగా ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఆనాటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి నేటి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు వేముల. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం లేదని గ్రీన్‌ట్రిబ్యునల్‌కు చెప్పి దొంగతనంగా నిర్మిస్తున్నారంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అన్ని వివరాలు తెప్పించారని, త్వరలోనే ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. అయినప్పటికీ ప్రాజెక్ట్‌లు ఆపకపోతే యుద్ధం తప్పదంటూ శంఖారావం పూరించారు ప్రశాంత్‌రెడ్డి.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి కామెంట్స్‌పై ఇటు రాయలసీమ నేతలు సైతం గట్టిగానే స్పందించారు. రాయలసీమ ప్రయోజనాలకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమంటూ సీరియస్‌గా రియాక్టవుతున్నారు. అటు, ప్రశాంత్‌రెడ్డి కామెంట్స్‌ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. నీటి విధానంపై ఏపీ దగ్గర ఓ విధానమంటూ లేదన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి ఆలోచనా ధోరణిలోనే కొంతమంది ఇప్పటికీ వెళ్తున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు.

ప్రశాంత్‌రెడ్డి కామెంట్స్‌పై ఇటు.. నెల్లూరులోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది బీజేపీ. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు అనుమతులెక్కడివని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పడాన్ని ఖండించారు.

ఇటు తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులేం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి. బేసిన్లు లేవు.. బేషజాలు లేవన్న సీఎం కేసీఆర్‌.. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఇప్పుడేమంటారన్నారు.

ఈ జల జగడం రానున్న రోజుల్లో ఎటుదారితీయనుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ కొత్త వార్‌ తప్పదా అన్న చర్చ సాగుతోంది.

Read Also…  Parents Ablazed Daughter: రాయచోటిలో మరో పరువ హత్య.. ప్రేమించిన పాపానికి కూతురుపై ఘాతుకం.. చికిత్సపొందుతూ యువతి మృతి!