AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైస్ మిల్లర్లకు ఇక చుక్కలే..! ప్రతి బుధవారం సడెన్ చెక్.. సీఎంఆర్‌పై డిజిటల్ కన్ను..!

తెలంగాణలో రైస్ మిల్లుల్లో సీఎంఆర్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం 'డిజిటల్ కన్ను'తో నిఘా పెంచింది. పీవీ యాప్ ద్వారా ధాన్యం కేటాయింపు, మిల్లింగ్, బియ్యం నిల్వలు, సీఎంఆర్ డెలివరీలను ట్రాక్ చేయనుంది. ప్రతి బుధవారం యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహించి, వాస్తవ స్టాక్‌తో సరిపోల్చి, పారదర్శకతను పెంచడం, అక్రమాలకు చెక్ పెట్టడం దీని లక్ష్యం. మిల్లర్లు, అధికారుల పనితీరునూ పర్యవేక్షిస్తారు.

రైస్ మిల్లర్లకు ఇక చుక్కలే..! ప్రతి బుధవారం సడెన్ చెక్.. సీఎంఆర్‌పై డిజిటల్ కన్ను..!
Rice Mills Telangana
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 21, 2026 | 8:23 PM

Share

తెలంగాణ: రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, ప్రభుత్వానికి అందాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (CMR) డెలివరీలపై నిఘా మరింత పెరగనుంది. సీఎంఆర్ వ్యవస్థలో అక్రమాలు, స్టాక్ గోల్‌మాల్‌కు అడ్డుకట్ట వేసేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ కొత్త డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ (PV) యాప్ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ యాప్ ద్వారా మిల్లుకు కేటాయించిన ధాన్యం నుంచి మిల్లింగ్, బియ్యం నిల్వలు, ప్రభుత్వానికి చేసిన CMR డెలివరీ వరకు వివరాలను డిజిటల్‌గా ట్రాక్ చేయనున్నారు. ముఖ్యంగా తనిఖీల కోసం ర్యాండమైజేషన్ విధానాన్ని అమలు చేయడం ఈ వ్యవస్థలో కీలక అంశంగా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారం రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఏ అధికారి ఏ మిల్లుకు వెళ్లాలన్నది ముందుగానే నిర్ణయించకుండా PV యాప్ ద్వారా ర్యాండమ్‌గా కేటాయిస్తారు. తనిఖీకి వెళ్లే అధికారికి సుమారు 12 గంటల ముందు లేదా ఒక రోజు ముందు SMS ద్వారా సమాచారం అందుతుంది. దీంతో ముందుగానే సమాచారం తెలుసుకుని స్టాక్‌ను మార్చడం లేదా రికార్డులను సర్దుబాటు చేయడం వంటి అవకాశాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

తనిఖీ సమయంలో యాప్‌లో నమోదైన వివరాలను మిల్లులోని వాస్తవ నిల్వలతో అధికారులు పోల్చి చూస్తారు. కేటాయించిన ధాన్యం ఎంత? ఎంత మిల్లింగ్ చేశారు? ప్రభుత్వానికి ఎంత CMR బియ్యం ఇచ్చారు? ఇంకా ఎంత ఇవ్వాలి? ప్రస్తుతం మిల్లులో ఉండాల్సిన స్టాక్ ఎంత? వంటి వివరాలను పరిశీలిస్తారు. లెక్కల్లో తేడాలు కనిపిస్తే వాటిని యాప్‌లోనే నమోదు చేసి, అవసరమైతే పంచనామా నిర్వహించి సంబంధిత నివేదికను డిజిటల్‌గా అప్‌లోడ్ చేస్తారు.

ఈ వ్యవస్థ ద్వారా మిల్లర్లతో పాటు తనిఖీలు నిర్వహించే అధికారుల పనితీరుపైనా పర్యవేక్షణ ఉండనుంది. క్షేత్రస్థాయి అధికారులు నమోదు చేసిన వివరాలను ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్లు, హెడ్ ఆఫీస్ బృందాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. గత సీజన్లలో CMR బియ్యం డెలివరీలో వెనుకబడిన మిల్లర్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. పెండింగ్ స్టాక్, బకాయిలు, డెలివరీ వివరాలను యాప్‌లో ట్రాక్ చేయడం ద్వారా డిఫాల్ట్ మిల్లర్లపై పర్యవేక్షణ పెంచనున్నారు.

మొత్తంగా ర్యాండమ్ తనిఖీలు, డిజిటల్ రికార్డులు, ఫిజికల్ స్టాక్‌తో పోలిక, ఉన్నతస్థాయి క్రాస్‌చెకింగ్ ద్వారా సీఎంఆర్ వ్యవస్థలో పారదర్శకత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం క్షేత్రస్థాయిలో ఎంత సమర్థంగా అమలవుతుందన్నదే కీలకంగా మారనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us