Telangana Budget: తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ బీపాస్ విధానంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామావు సమాధానం ఇచ్చారు. టీఎస్ బీపాస్ విధానం ద్వారా.. 75 చదరపు గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. 600 చదరపు గజాల వరకు 10 మీటర్ల ఎత్తు వరకు తక్షణ భవన అనుమతిని దరఖాస్తుదారుని స్వయం ధృవీకరణ ఆధారంగా ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు.
ఇక 10 మీటర్లకు పైబడి ఎత్తు కలిగిన భవనాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. 80 శాతానికి పైగా దరఖాస్తులు తక్షణ ఆమోదం పొందుతాయని స్పష్టం చేశారు. బీపాస్ విధానం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లో 12 వేల 943 భవనాలకు అనుమతులు జారీ చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కేపీహెచ్‌బీ పాత భవనాల స్థానంలో కొత్త నిర్మాణాల ప్రతిపాదనలపై ఆలోచిస్తామని కేటీఆర్ చెప్పారు. గ్రామకంఠం విషయంలో ఉన్న ఇబ్బందులపై దృష్టి సారిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సంబంధించి.. కొత్తగా 200ల పైచిలుకు పోస్టులను మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
బీపాస్ పట్ల భవన నిర్మాణదారుల సంతృప్తి
జాప్యానికి చోటు ఉండదు.. అవినీతి, ఆలస్యం అనే మాటే వినపడదు. భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్ బీ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నూతన విధానం ద్వారా నిర్దేశించిన గడువులోగా ఆన్‌లైన్‌లో ఇండ్ల అనుమతులు పొందవచ్చు. సులభంగా, సత్వరంగా సేవలు అందించే టీఎస్ బీపాస్ దేశానికే ఒక మోడల్‌గా నిలువనున్నదని బిల్డర్లు, నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. రియల్ రంగానికి మరింత ఊపు రానున్నదని చెబుతున్నారు. సింగిల్ విండో పద్ధతి నిర్మాణదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, నిర్మాణ రంగ అనుమతుల్లో ఇది నవ శకంగా అభివర్ణిస్తున్నారు.
పరిశ్రమల అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ తరహాలోనే టీఎస్ బీపాస్ దేశమంతా ప్రాచుర్యం పొందే అవకాశమున్నది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదో మైలురాయి వంటిది. ఇక నుంచి భవన నిర్మాణంలో జాప్యానికి చోటు ఉండదు. ప్రాజెక్టుల నిర్మాణం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడం వల్ల అటు బిల్డర్లకు, ఇటు భూ యజమానులకు లాభం చేకూరుతుంది. మొత్తానికి భవన నిర్మాణ రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణగా అభివర్ణిస్తున్నారు.
Read More:
Telangana Budget: అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్ ఏర్పాటు పరిశీలనలో ఉంది.. శాసనమండలిలో హరీశ్ రావు
Telangana Budget: వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోలేదా..? అయితే మీ కార్డు క్యాన్సెల్