Telangana: తెలంగాణలోకి పీకే ఎంట్రీ.. కాంగ్రెస్‌లో అయోమయం.. బీజేపీకి దొరికిన కొత్త ఆయుధం!

|

Apr 29, 2022 | 8:44 AM

Prashant Kishor: ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) కాంగ్రెస్‌ (Congress)లో చేరాలనే ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా మంగళవారం వెల్లడించారు. అయితే ప్రశాంత్‌ కిశోర్‌ తీసుకున్న..

Telangana: తెలంగాణలోకి పీకే ఎంట్రీ.. కాంగ్రెస్‌లో అయోమయం.. బీజేపీకి దొరికిన కొత్త ఆయుధం!
Prashant Kishor
Follow us on

Prashant Kishor: ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) కాంగ్రెస్‌ (Congress)లో చేరాలనే ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా మంగళవారం వెల్లడించారు. అయితే ప్రశాంత్‌ కిశోర్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ (TRS), ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారనే జరుగుతున్న ప్రచారంలో భాగంగా తెలంగాణ (Telangana)లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక అకస్మాత్తుగా హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ప్రశాంత్‌ కిశోర్‌.. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు కాంగ్రెస్‌తో చర్చలు జరిపిన ప్రశాంత్‌ కిశోర్‌.. తెలంగాణలోనూ టీఆర్‌ఎస్‌లో చర్చలు జరిపిన విషయాలన్ని బీజేపీ నేతలు తమ అధిష్టానాకి ఇచేరవేరుస్తున్నారు. రెండు పార్టీలతో చర్చలు జరపడంపై భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే వ్యూహాలను రచిస్తోంది బీజేపీ. పీకే చర్చలు ఓవైపు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో, మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారితీసింది. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లతో చర్చలు జరిపిన నేపథ్యంలో.. ఆ రెండు పార్టీలు ఒకటేనని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలు ఇరు పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో మంతనాలు సాగించిన పీకే.. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ కోసం ఇప్పటికే సర్వేలు చేయించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణలో పార్టీకి నష్టం చేకూరుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావించారు. మరోవైపు కొందరు టీఆర్ఎస్ నాయకులు.. పీకే కాంగ్రెస్‌లో చేరి, ఆయనకు చెందిన ఐ ప్యాక్ తమ పార్టీ కోసం పనిచేస్తే క్యాడర్‌లోకి, ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని భావించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకటేనని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఒకే నాణానకి రెండు ముఖాలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ప్రశాంత్ కిశోర్‌ కీలకమని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రామచందర్‌రావు అన్నారు.

ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌లో చేరకపోవడం అటు టీ కాంగ్రెస్‌లో, ఇటు టీఆర్ఎస్ నాయకులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పీకే కాంగ్రెస్‌లో చేరవచ్చనే వార్తలతో గందరగోళం నెలకొంది. తర్వాత పీకే.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి చర్చలుజరిపిన తర్వాత.. ఐ-ప్యాక్‌ మా కోసం పనిచేస్తుందని అధికారిక ప్రకటన రావడంతో కాస్త ఊరట కలిగింది. అయితే టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందని బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఈ చర్చలు మాకు ఇబ్బందికరంగా ఉండేది. అంతా మా మంచికే జరిగినందుకు మేము సంతోషిస్తున్నాం అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ ఆఫర్‌ను నిరాకరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కన్సెల్టెంట్‌ లేకుండా చాలా ఎన్నికల్లో గెలిచిందన్నారు. తమ అధినాయకత్వంలో పార్టీ శ్రేణులను నడిపించడానికి అవసరమైన వ్యుహాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడే స్పూర్తి తమ క్యాడర్‌కు ఉందన్నారు. అయితే పీకే చర్య కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అనే మాటను రేవంత్ కొట్టిపారేశారు. ఇది ప్రశాంత్ కిషోర్‌కి ఎదురుదెబ్బే కావచ్చని అన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది చేరాలని అనుకుంటున్నారని చెప్పారు. ఇక రేవంత్‌ రెడ్డికి పాలాభిషేకం చేయడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహపరిచింది. మే 6వ తేదీన వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ సభకు ముఖ్య అథితిగా రాహుల్‌ గాంధీ హాజరు కానున్నారు.

మరో వైపు తెలంగాణ రాజీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్న బండి సంజయ్‌ సారథ్యంలో రాష్ట్ర బీజేపీ.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను ఇరుకున పెట్టేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సంజయ్‌ పాదయాత్ర కొనసాగించి కేసీఆర్‌ దుష్పరిపాలనను బయటపెట్టేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌ తీసుకున్న నిర్ణయం బీజేపీకి ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌ సభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయని, ఇరు పార్టీల మధ్య ప్రశాంత్‌ కిశోర్‌ మధ్యవర్తిత్వం వహించారని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు. దీంతో 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 31 స్థానాలు, 17 లోక్‌ సభ స్థానాలకు గానూ 4 స్థానానాలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు మిగులుతాయని సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ వాదనలను తోసిపుచ్చిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌తో కాంగ్రెస్‌ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని, 2023లో కేసీఆర్‌ను ఓడించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో అడుగు పెట్టిన ప్రశాంత్‌ కిశోర్‌.. టీఆర్‌ఎస్‌లో మంతలు జరిపారు. తర్వాత అటు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీతో మంతనాలు జరిపారు. వీరి మంతనాల మధ్య టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండు కలిసిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్‌యంలో ప్రశాంత్‌ కిశోర్‌తో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ జరుగుతున్న చర్చల విషయాలను బీజేపీ హైకమాండ్‌కు చేరవేస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలో కలిసిపోతున్నాయన్న చర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 7% ఉన్న బీజేపీ ఓట్ల శాతం.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 20%కి పెరిగింది. నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌కు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘోర పరాజయాన్ని చవిచూడగా, ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేసీఆర్ కుమార్తె, కవిత బీజేపీ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచిన ఉత్తర తెలంగాణను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అలాగే రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బేనని చెప్పాలి. హుజూరాబాద్ ఓటమిని కేసీఆర్‌కు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించారు.

అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరకపోవడానికి.. పార్టీలో ఆయనకు స్వేచ్చ ఇవ్వడానికి అధిష్టానం అంగీకరించలేదని నివేదికలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారంపై, ఇతర అంశాలపై కాంగ్రెస్‌, పీకేల మధ్య చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది.

మరిన్ని పాలిటిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Munnuru Ravi: మున్నూరు రవితో ఫోటో వివాదంపై వివరణ ఇచ్చిన బషీరాబాద్ సీఐ రమేష్

Pilot vs Patnam: పైలట్‌ వర్సెస్‌ పట్నం.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన తాండూరు తన్నులాట!