ఏపీలో ఫేక్ ట్వీట్‌ల రచ్చ కొనసాగుతోంది. గతవారం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు జోరుగా వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై దేవినేని ఉమ రంగంలోకి దిగారు. తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ ట్వీట్‌ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటి రాంబాబుపై మంగళవారం ఉదయం సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు దేవినేని ఉమ. ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశాలన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసినట్లు ఒక ఫేక్ ట్వీట్ వైరల్ చేశారన్నారు. ఇకైనా నకిలీ ప్రచారాలు మానుకోవాలని అన్నారు. టీడీపీ నేతలైన వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బచ్చుల అర్జునుడు సహా తన పేరుతో కూడా వైఎస్సార్‌సీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ట్వీట్లు పెట్టారని అన్నారు. చివరకు తమ అధినేత చంద్రబాబు సంతకం, పార్టీ లెటర్ హెడ్ పోర్జరీ చేశారన్నారు.
భాద్యత గల మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు ఆ ఫేక్ ట్వీట్‌ను సమర్ధిస్తూ ట్వీట్ చేశారంటే అందులో ఉన్న కుట్రకోణం అర్దమవుతుందన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఫేక్ ట్వీట్లను మంత్రే షేర్ చేస్తున్నారంటే దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఫేక్ ప్రచారాలతో ఇంకెంతకాలం పబ్బం గడుపుతారు? పింక్ డైమండ్,ఆరు లక్షలకోట్ల అవినీతి అంటూ ఫేక్ ప్రచారాలు చేశారు. కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారు. నేను ఇలాంటి ట్వీట్ పెట్టానంటే ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నావు? ఇకనైనా ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్ లు మానుకో…@ysjagan pic.twitter.com/WpLFgUtMad
— Devineni Uma (@DevineniUma) June 6, 2022
మంత్రి అంబటి రాంబాబు స్వయంగా ట్విట్ చేశాడన్నారు. ఇందులో కుట్ర కోణం ఉందన్నారు. కులాలు మధ్య, పార్టీలు మధ్య చిచ్చు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని సూచించారు. గౌతు శిరీషను ఉదయం నుంచి విచారణ చేస్తున్నారని, ఏ మంత్రి ప్రెస్‌మీట్ పెట్టాలన్న సజ్జల నుంచి స్క్రిప్టు వస్తుందన్నారు. ఫేక్ ట్విట్ పెట్టిన మంత్రి అంబటి రాంబాబును విచారణ చేస్తారా? అని ఉమా ప్రశ్నించారు. తన మీద ఫేక్ ట్వీట్ ఎవరు పెట్టారో సీఐడీ అధికారులు విచారణ జరపాలన్నారు. తప్పుడు ట్విట్‌ను ఎలా బాధ్యత గల మంత్రి రీ ట్విట్ చేస్తారు? అని ప్రశ్నించారు.