ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తామంటూ ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై వివిధ వర్గాలతో మంతనాలు జరుపుతున్నారు. వివిధ జిల్లాల్లోని వైయస్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్టీ విధి విధానాలు, జెండా అజెండాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నుంచి మొదలు కొని ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకి పలువురు నేతలు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ స్థాపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందంటూ తెలంగాణ వాదులకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక షర్మిల పార్టీపై అటు ఏపీలోనూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడిన షర్మిలను సీఎం జగన్ అన్యాయం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారాయి.
తెలంగాణలో కొత్త పార్టీ అంటూ వైఎయస్ షర్మిల రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కర్నూలులో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం చేశారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పెద్దమార్కెట్ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పాతబస్టాండు, గోశా హాస్పిటల్, స్టేట్ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు.
రోడ్‌షోలో ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో చంద్రబాబు మాట్లాడారు. చెన్నమ్మ సర్కిల్ వద్ద చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా షర్మిలపై చంద్రబాబు కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Read More:
ఏపీలో బీజేపీకి జనసేన షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో పాతమిత్రుడితో కలిసి చెట్టాపట్టాల్
సీఎం జగన్‌తో ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ.. మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం ఖాయం -సజ్జల
రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు.. బంద్‌కు సంఘీభావం తెలిపిన వైసీపీ