ఆ జిల్లాలో సీన్‌ రివర్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో తలకిందులవుతున్న పార్టీల బలాబలాలు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఒక్కోచోట పార్టీల బలాబలాలు తలకిందులవుతున్నాయి. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన..

  • K Sammaiah
  • Publish Date - 12:25 pm, Fri, 5 March 21
ఆ జిల్లాలో సీన్‌ రివర్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో తలకిందులవుతున్న పార్టీల బలాబలాలు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఒక్కోచోట పార్టీల బలాబలాలు తలకిందులవుతున్నాయి. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ వైసీపీ.. మున్సిపల్‌ ఎన్నికలు వచ్చేసరికి కాస్త గట్టిగానే కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో సీన్‌ మారిపోయింది. ఈ జిల్లాలో వైసీపీ వెనుకబడిపోయింది. పంచాయితీ ఎన్నికల్లో జోరు కొనసాగించిన వైసీపీ మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటిల్లో 198 వార్డులుండగా కేవలం 24 వార్డులను మాత్రమే ఏకగ్రీవంగా దక్కించుకుంది వైసీపీ.

అద్దంకిలో అయితే వైసీపీ సీన్‌ పూర్తిగా రివర్సయింది. 8వ వార్డులో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు వైసీపీ నేతలు. మరోవైపు ఓ అభ్యర్థికి బీఫామ్‌ ఇస్తే టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కారు లోంచే దిగి పరుగెత్తుకుంటు వెళ్లి మరీ తన నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారు అభ్యర్థి. ఈ పరిణామంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. దీంతో అద్దంకిలోని 8వ వార్డులో ఎన్నిక నిలిచిపోయింది. దీంతో ఈ టాపిక్‌ కాస్తా అద్దంకిలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 2,3 వ తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించడంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలకు ప్రయత్నించారు. అయితే ఒంగోలులో ఒకటి, మార్కాపురంలో 5, గిద్దలూరులో 7, చీమకుర్తిలో ఒకటి, కనిగిరిలో 7, చీరాలలో 3 ఇలా.. 198 వార్డుల్లో కేవలం 24 వార్డులను మాత్రమే ఏకగ్రీవం చేసుకోగలిగారు వైసీపీ నేతలు.

అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, వైసీపీ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణచైతన్య పోటాపోటీగా పావులు కదిపారు. ఏకగ్రీవాలు చేసుకునేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఇక్కడ ఫలించలేదు. ఇద్దరు టీడీపీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అయితే బొజ్జా పరశురాం అనే వ్యక్తికి బీఫాం ఇచ్చి నామినేషన్‌ వేయించడంతో పావులు కదిపిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చివరి నిమిషంతో తమ వైపుకు తిప్పుకుని నామినేషన్‌ ఉపసంహరించేలా చేశారు. దీంతో షాక్‌ కు గురి కావడం వైసీపీ వంతైంది.అద్దంకి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికి ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. అదే ఇప్పుడు వైసీపీపై టీడీపీ పైచేయి సాధించేలా చేసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే అద్దంకిని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు గొట్టిపాటి రవి.

Read More:

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో స్తంభించిన ఏపీ.. ఏపీ బంద్‌కు అఖిలపక్షాల సంఘీభావం