తెలంగాణ రాజకీయాల్లో ఇదో సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. టీఆర్‌ఎస్ నేత, మంత్రి హరీశ్ రావుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటి అయ్యారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటివారు ఎందుకు కలిశారా అన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి హరీష్ రావుతో మాట్లాడారు జగ్గారెడ్డి. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన విజ్ఞప్తిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం నియోజకవర్గ సమస్యల గురించే కలిశారా..లేదంటే తెర వెనక ఇంకేమైనా జరుగుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరకుండా హరీష్ రావే అడ్డుకున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఒకవైపు సీఎం కేసీఆర్‌ను..కేటీఆర్‌ను పొగుడుతూనే మరోవైపు హరీశ్ రావుపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించారు జగ్గారెడ్డి. సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు సంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు తెలియకుండా హరీశ్ జలదోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చాలా సందర్భాల్లో ఆరోపించారు. 2008లో కేవీపీ ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు హరీశ్ ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు.. హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.